Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట.. జూడోకాలో పసిడి ధమాకా.. నీరజ్ చోప్రాకు రజతం..
Commonwealth Games 2026 : ప్రస్తుతానికి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 23 పతకాలు సాధించింది. వీటిలో ఐదు స్వర్ణాలు, 12 రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.
Commonwealth Games 2026 two gold medals in judo Neeraj Chopra Silver
- కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాలు
- జూడోకాలో పసిడి ధమాకా
- జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు రజతం
Commonwealth Games 2026 : కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పతకాల పంట పండిస్తున్నారు. భారత కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి జూడోలో ఇండియా పసిడి ఖాతా తెరించింది.. అదికూడా ఒకేరోజు రెండు స్వర్ణాలు సాధించగా.. జావెలిన్ లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించగా.. యువ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో పురుషుల జావెలిన్ త్రోలో భారత్ ఒకేసారి రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది.
Also Read : Harsha Bhogle : వైభవ్‌కు వైస్‌కెప్టెన్సీ.. హర్షా బోగ్లే కామెంట్స్ వైరల్.. అలా ఎలా చేశారు?
కామన్వెల్త్ క్రీడల్లో భారత జూడో క్రీడాకారులు అదరగొట్టారు. మహిళల 48కేజీల విభాగంలో 23ఏళ్ల అస్మిత డే విజేతగా నిలిచి దేశానికి జూడోలో తొలి స్వర్ణాన్ని అందించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈ త్రిపుర క్రీడాకారిణి కెనడా క్రీడాకారిణి హైది కువాచ్ను ఓడించింది. మరోవైపు.. పురుషుల 60 కేజీల విభాగంలో 23ఏళ్ల హర్ష్ సింగ్ ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జాషువా కట్జ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి పసిడి దక్కించుకున్నాడు. మరోవైపు హోరాహోరీగా సాగిన మహిళల 57 కేజీల విభాగంలో యామిని రజతం దక్కించుకుంది. ఆమె అసెల్యా టోప్రక్ (ఇంగ్లాండ్) చేతిలో ఓడింది.
నీరజ్ చోప్రాకు రజతం..
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్-2026లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ తన సీజన్లో అత్యుత్తమమైన 85.83 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది రెండో పతకం కావటం గమనార్హం. ఇదిలాఉంటే.. ఈ పోటీలో శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాజే అద్భుత ప్రదర్శన చేసి 89.75 మీటర్ల త్రోతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరో భారత అథ్లెట్ యశ్వీర్ సింగ్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ విభాగంలో భారత్ ఒకేసారి రజత, కాంస్య పతకాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతానికి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 23 పతకాలు సాధించింది. వీటిలో ఐదు స్వర్ణాలు, 12 రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.
