Bullet Train Corridor: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. తొలి స్టేషన్ ఎక్కడో తెలుసా.. రూట్ మ్యాప్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా వెళ్లే మూడు ప్రధాన హైస్పీడ్ బుల్లెట్ రైలు(Bullet Train Corridor) కారిడార్లకు సంబంధించి కీలక ప్రతిపాదనలు ఖరారయ్యాయి.
Bullet train corridor finalized via Hyderabad-Chennai, Amaravati, and Dachepalli stations.
- అమరావతి మీదుగా బుల్లెట్ రైలు
- దాచేపల్లిలో తొలి రైల్వే స్టేషన్
- ఆకాశ మార్గంలో ఎలివేటెడ్ నిర్మాణం
Bullet Train Corridor: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రం మీదుగా వెళ్లే మూడు ప్రధాన హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లకు సంబంధించి కీలక ప్రతిపాదనలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ – చెన్నై బుల్లెట్ రైలు(Bullet Train Corridor) ప్రాజెక్టు ఏపీ రాజధాని అమరావతి మీదుగా పయనించేలా రూట్ మ్యాప్‌ను అధికారులు అధికారికంగా సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో అత్యధిక భాగం ఏపీ పరిధిలోనే నిర్మాణం కానుండటం విశేషం.
తొలి స్టేషన్ దాచేపల్లిలోనే.. భూసేకరణపై ఏపీ సర్కార్ వేగం:
హైదరాబాద్ నుంచి ఏపీలోకి ప్రవేశించగానే తొలి బుల్లెట్ రైలు స్టేషన్‌ను పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జాతీయ హైస్పీడ్ రైలు సంస్థ (NHSRCL) లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. రెవెన్యూ రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేసి త్వరలోనే రైల్వే శాఖకు స్థలాలను అప్పగించేలా మ్యాపింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఎలివేటెడ్ విధానంలో నిర్మాణం.. గంటలోనే అమరావతి టూ చెన్నై:
ఈ ప్రాజెక్టును పూర్తిగా పిల్లర్లపై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ విధానంలో చేపట్టనున్నారు. దీనివల్ల ఎలాంటి రోడ్డు ట్రాఫిక్ అంతరాయం లేకుండా రైళ్లు గరిష్ట వేగంతో ప్రయాణించే వీలుంటుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అమరావతి నుంచి చెన్నైకి కేవలం గంట వ్యవధిలోనే చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే డీపీఆర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభం కానున్నాయి.
