Palla Srinivas: గెలుపు గుర్రాలకే ఛాన్స్.. స్థానిక సమరానికి ఎన్డీయే మాస్టర్ ప్లాన్.. తిరుపతి వేదికగా పల్లా సంచనల కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీల సమన్వయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు
Palla Srinivasa Rao key comments on AP local body elections and NDA candidates Selection
Palla Srinivas: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమిలో టికెట్ల కేటాయింపు, పార్టీల సమన్వయంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivas) అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమకు స్థానిక పోరు కంటే సార్వత్రిక ఎన్నికల లక్ష్యాలే ముఖ్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కేవలం గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న సమర్థులైన అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఖరాకండిగా తేల్చిచెప్పారు.
ఎన్డీయే కోఆర్డినేషన్ కమిటీ పరిశీలన: సర్వేల ఆధారంగానే ఎంపిక:
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సిఫార్సులను ముందుగా ఎన్డీయే కోఆర్డినేషన్ కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుందని, అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంయుక్తంగా తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మేయర్ పదవుల విషయంలో బీజేపీ, జనసేనలకు వారి డిమాండ్లు ఉన్నాయని, అభ్యర్థుల ప్రజాదరణను అంచనా వేసేందుకు ఇప్పటికే ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
వైసీపీపై సంచలన ఆరోపణలు.. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలతో కుట్రలు
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దారుణంగా అప్పులపాలు చేసిందని, సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా వారి వైఖరిలో మార్పు రాలేదని పల్లా మండిపడ్డారు. కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ తీవ్రంగా యత్నిస్తోందని ఆరోపించారు. విదేశాల నుంచి టీడీపీ, జనసేన పేర్లతో ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి విభేదాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు నేరుగా సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
