Ajit Agarkar : బీసీసీఐ మీటింగ్‌కు డుమ్మా.. కట్ చేస్తే.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో అజిత్ అగార్కర్ ప్రత్యక్షం..
టీమ్ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.
Team India Chief selector Ajit Agarkar spotted at duleep trophy final after missing bcci review meeting
Ajit Agarkar : టీమ్ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్‌ను ఆయన స్టాండ్స్‌లో కూర్చొని వీక్షించారు. ఇటీవల ముంబైలో జరిగిన బీసీసీఐ కీలక సమీక్షా సమావేశానికి అగార్కర్ హాజరుకాకపోవడంతో ఆయన భవిష్యత్తుపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అగార్కర్ కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట సందర్భంగా కార్పొరేట్ బాక్స్‌లో ఒంటరిగా కూర్చున్న అగార్కర్, దేశవాళీతో పాటు భారత జట్టు ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా గమనించారు. త్వరలో జరగనున్న ఇండియా ‘ఎ’ జట్టు సిరీస్‌ల కోసం ఆటగాళ్ల ఎంపిక నేపథ్యంలో ఆయన పర్యవేక్షణ కీలకంగా మారింది.
Sanju Samson : సంజూ శాంసన్‌కు ఘోర అవమానం! కూరలో కరివేపాకులా తీసేశారా?
గత గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ సమీక్ష సమావేశానికి అగార్కర్ గైర్హాజరయ్యారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత జట్టు ఎదుర్కొన్న సిరీస్ పరాజయాలు, అలాగే 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అగార్కర్ గైర్హాజరుపై వచ్చిన అనుమానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అప్పట్లో స్పష్టత ఇచ్చారు. ముందస్తుగా ఉన్న ప్రయాణ ఏర్పాట్లు, కనెక్టివిటీ సమస్యల కారణంగానే అగార్కర్ సమావేశానికి హాజరు కాలేకపోయారని తెలిపారు. సమావేశం చాలా తక్కువ సమయంలో ఏర్పాటు కావడంతో ఆయన పట్టణంలో లేరని, ఉన్న ప్రాంతం నుంచి ఆన్లైన్లో కూడా పాల్గొనడం సాధ్యం కాలేదని వివరించారు.
ఈ కీలక సమావేశానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ ఆఫ్ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. అగార్కర్ ఒప్పందం ఈ నెలాఖరుతో ముగిసే అవకాశం ఉందన్న వార్తలపై కూడా సైకియా స్పందించారు. సమీక్ష సమావేశంలో సెలక్షన్ కమిటీ పదవీకాలం లేదా పొడిగింపుపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లో జట్టు ప్రదర్శనతో పాటు శ్రీలంక టెస్టు సిరీస్, రాబోయే సిరీస్‌లు, అంతిమ లక్ష్యమైన ప్రపంచకప్‌పైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిపారు.
చెపాక్‌లో అగార్కర్ ప్రత్యక్షం కావడం ఇప్పుడు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే రెండు నెలల్లో ఆస్ట్రేలియా ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్లతో జరగనున్న ఐదు స్వదేశీ, విదేశీ ‘ఎ’ టెస్టులకు ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ సందర్భంగా బెంగళూరులోని సీఓఈ మైదానాల్లో సెలక్షన్ కమిటీ సభ్యులు అజయ్ రాత్రా, ఆర్పీ సింగ్, ఎస్ఎస్ దాస్, ప్రజ్ఞాన్ ఓజా.. ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించారు. ఇప్పుడు ఫైనల్లో అగార్కర్ స్వయంగా హాజరవడంతో, రాబోయే ఇండియా ‘ఎ’ జట్టు ఎంపికపై మరింత ఆసక్తి నెలకొంది.
