Lionel Messi : మ‌న పిల్ల‌ల‌కు నువ్వే హీరో.. మెస్సీ రిటైర్‌మెంట్ పై భార్య పోస్ట్ వైర‌ల్‌..

మెస్సీ (Lionel Messi) రిటైర్‌మెంట్ పై అత‌డి భార్య ఆంటోనిలా రొకుజో సోష‌ల్ మీడియాలో భావోద్వేగ లేఖ‌ను పంచుకున్నారు.

Lionel Messi Wife Antonela Roccuzzo Pens Emotional Note after her husband Retirement

Lionel Messi : అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఓ శ‌కం ముగిసింది. దిగ్గ‌జ ఆట‌గాడు లియోన‌ల్ మెస్సీ ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు. ఇక‌పై తాను అర్జెంటీనాకు ఆడ‌న‌ని ప్ర‌క‌టించాడు. అర్జెంటీనాకు గుడ్ బై చెప్పిన‌ప్ప‌టికి కూడా.. క్ల‌బ్ ఫుట్‌బాల్‌లో అత‌డు కొన‌సాగ‌నున్నాడు.

‘రిటైర్‌మెంట్ కావ‌డానికి ఇదే సరైన స‌మ‌యం. ఈ నిర్ణ‌యం ఎంతో భాదిస్తుంది. నేను ఎప్పుడు బ‌రిలోకి దిగిన స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డాను. ఈ జెర్సీ కోసం మైదానంలో ఎంతో పోరాడాను. మీకు ఆనందాన్నివ్వ‌డం, అర్జెంటీనా పౌరులుగా మీరు గ‌ర్వ‌ప‌డేలా చేయ‌డం కోస‌మే ఇదంతా.’ అంటూ సోష‌ల్ మీడియాలో మెస్సీ పోస్ట్ పెట్టాడు.

రెండు ద‌శాబ్దాల కెరీర్‌లో మెస్సీ 207 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 125 గోల్స్ సాధించాడు. అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ సాధించిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్టియానా రొనాల్డో (146 గోల్స్‌) అగ్ర‌స్థానంలో ఉన్నాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడాడు. 2022లో అర్జెంటీనా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఆంటోనిలా తీవ్ర భావోద్వేగం..

మెస్సీ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అత‌డి భార్య ఆంటోనిలా రొకుజో సోష‌ల్ మీడియా భావోద్వేగ‌మైన లేఖను పంచుకుంది. మెస్సీ జీవితంలోని అతి ముఖ్య‌మైన అధ్యాయాన్ని చాలా ద‌గ్గ‌రగా చూసినందుకు తాను ఎంత‌గా గ‌ర్విస్తున్నానో చెప్ప‌డానికి మాట‌లు స‌రిపోవ‌డం లేద‌న్నారు. ఎన్నెన్నో జ్ఞాప‌కాలు, మ‌రెన్నో ఆనందాలు, ఇంకెన్నో క‌ఠిన స‌మ‌యాలు, మెస్సీ ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడో త‌న‌కు మాత్ర‌మే తెలుసున‌ని చెప్పుకొచ్చారు. ల‌క్ష్యాల‌ను చేరుకునే క్ర‌మంలో అవాంత‌రాలు ఎదురైన‌ప్పుడు వెన‌క్కి త‌గ్గ‌లేద‌ని, ప్ర‌య‌త్న లోపం లేకుండా ముందుకు సాగుతూ అనుకున్న‌ది సాధించాడ‌ని తెలిపింది.

మెస్సీ క‌ష్ట‌సుఖాల్లో భాగ‌మైనందుకు తానేంతో అదృష్ట‌వంతురాలిన‌ని తెలిపింది. ‘ఇక అన్నింటికి మించి మ‌న పిల్లలు నీ ఎదుగుద‌ల‌ను చూస్తూ పెరిగారు. వాళ్ల నాన్న ఆశ‌యం కోసం ఎలా పోరాడారో క‌ళ్లారా చూశారు. ఎన్ని క‌ష్టాలు ఎదురైనా స‌రే ప‌ట్టు విడువ‌కూడ‌ద‌ని నేర్చుకున్నారు. విజ‌యం వ‌రించే వ‌ర‌కు అలుపెరుగ‌క శ్ర‌మించాల‌ని నేర్చుకున్నారు. నువ్వు ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని ముద్దాడ‌డం చూసి వాళ్లు ఎంత‌గానో సంతోషించారు. ఇంత‌కంటే నాకు గొప్ప అదృష్టం ఇంకేం ఉంటుంది.’ అని ఆంటోనిలా రాసుకొచ్చింది.

మెస్సీ, ఆంటోనిలాకు ముగ్గురు కొడుకులు. కాగా.. వీరికి ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. తండ్రి ఎక్క‌డ మ్యాచ్ ఆడుతున్నా స‌రే త‌ల్లితో క‌లిసి స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ల‌ను చూస్తూ ఉంటారు.