RR vs MI : మీకు కొత్త.. మాకు కాదు.. వైభవ్ సూర్యవంశీ పై ముంబై కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చుక్కలు చూపిస్తాం..
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య (RR vs MI) మ్యాచ్ జరగనుంది
- Thota Vamshi Kumar
- Published On : April 7, 2026 / 11:56 AM IST
MI bowling coach Paras Mhambrey comments on Vaibhav Sooryavanshi batting style
- ఐపీఎల్‌లో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ
- 15 ఏళ్ల ఈ కుర్రాడి బ్యాటింగ్ శైలి పై ముంబై బౌలింగ్ కోచ్ కామెంట్స్
- ఇలాంటి బ్యాటింగ్ కొత్తేమీ కాదు.. ఔట్ చేసేందుకు వ్యూహాలు సిద్ధం
RR vs MI : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా.. టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఎలా ఎదుర్కొంటాడా? అని క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి పై ముంబై కోచ్ పరాస్ మాంబ్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆట తమకు కొత్తేమీ కాదన్నాడు. ‘వైభవ్ సూర్యవంశీకి ఇది రెండో ఐపీఎల్ సీజన్. అయినప్పటికి అతడు చాలా బాగా ఆడుతున్నాడు. ఆర్ఆర్ జట్టుకు అతడు విలువైన ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. అతడి ఆడే విధానం మాకు కొత్త కాదు. మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఇతర ప్లేయర్ల కోసం ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తామో, అతడి కోసమూ అలాంటివే సిద్ధం చేస్తాం.’ అని పరాస్ మాంబ్రే తెలిపాడు.
RR vs MI మ్యాచ్‌కు వర్షం ముప్పు..! మ్యాచ్ రద్దైతే ముంబై, రాజస్థాన్‌లలో ఎవరికి లాభం?
ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న ఆర్ఆర్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ పైనా పరాస్ మాంబ్రే స్పందించాడు. ఈ సీజన్‌లో అతడు కొత్తగా ఏమీ చేయడం లేదన్నాడు. అతడి బౌలింగ్‌లో పెద్దగా వైవిధ్యం లేదన్నాడు. అతడేమీ మిస్టర్ స్పిన్నర్ కాదు. గత కొన్నేళ్లుగా అతడు ఎలా బౌలింగ్ చేస్తున్నాడో ఇప్పుడు అలాగే చేస్తున్నాడు. కొత్తదనం అంటూ ఏమీ లేదు. ఆ రోజు బాగా ఆడితే సరిపోతుంది అని పరాస్ అన్నాడు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 30 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో ఆర్ఆర్ విజయం సాధించింది. మరో 16 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందింది.
