T20 World Cup 2026 : అందుకే ఓడిపోవాల్సి వచ్చింది.. అయినా గానీ.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ హాట్ కామెంట్స్
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026 ) ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Published On : March 9, 2026 / 07:06 AM IST
Mitchell Santner comments after New Zealand lost T20 World Cup 2026 final match against India
- టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్
- ఫైనల్‌లో న్యూజిలాండ్ ఓటమి
- ఓడిపోయినా గర్వంగా ఉందన్న మిచెల్ సాంట్నర్
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. న్యూజిలాండ్ జట్టు తృటిలో కప్పును చేజార్చుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పై కివీస్ 96 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీనిపై కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడం బాధను కలిగించిందన్నాడు. భారత్ అద్భుత ప్రదర్శన కారణంగానే తాము ఓడిపోయామని, ఏది ఏమైనప్పటికి కూడా సొంత గడ్డపై లక్షలాది అభిమానుల మధ్య తీవ్ర ఒత్తిడిలో భారత్ అసాధారణ ప్రదర్శన చేసిందని కొనియాడాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (89; 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (52; 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (54; 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. శివమ్ దూబె (26 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖరిలో విధ్వంసం సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ మూడు వికెట్లు తీశాడు. మాట్ హెన్రీ, రచిన్ రవీంద్రలు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (52; 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్ సాంట్నర్ (43 ;35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మిగిలిన వారంతా ఘోరంగా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలు తలా ఓ వికెట్ సాధించారు.
ఎంతో గర్వంగా ఉంది
ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు. తాము ఓడిపోయినప్పటికి కూడా ఎంతో గర్వంగా ఉందన్నాడు. ‘ఫైనల్ వరకు చేరుకున్నందుకు, జట్టు ఆటగాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ మెగాటోర్నీ ఆసాంతం మాకు కొన్ని సవాళ్లు ఎదురు అయ్యాయి. అయినప్పటికి కూడా ప్రతి దశలో వాటిని అధిగమించి.. మంచి ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగాము. ఇక ఈ రాత్రి లక్షలాది ప్రేక్షకుల సమక్షంలో ఓ అత్యుత్తమ జట్టు చేతిలో ఓడిపోయాము.’ అని సాంట్నర్ అన్నాడు.
భారతదేశంలో ఆడినప్పుడు కివీస్ జట్టుకు లభించే మద్దతు గురించి మాట్లాడుతూ.. ఇక్కడ మేం ఆడే చాలా మ్యాచ్‌ల్లో ప్రేక్షకుల మద్దతు మరువలేనిదన్నాడు. ఇక స్వదేశంలో ఫైనల్ మ్యాచ్ ఆడడం ఎంతో ఒత్తిడితో కూడుకున్నదని, అయినప్పటికి ఆ ఒత్తిడిని అధిగమించి భారత్ విశ్వవిజేతగా నిలవడాన్ని అభినందించాల్సిందేనన్నాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు అతడి బృందం వారు సాధించిన దాని పట్ల ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉంటుందన్నాడు.
ఏదీ ఏమైనప్పటికి తాము కూడా సూపర్-8, సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో చాలా బాగా ఆడామని సాంట్నర్ గుర్తు చేసుకున్నాడు. అయితే.. ఫైనల్‌లో భారత్ అద్భుతంగా ఆడి తమని ఓడించిందని చెప్పుకొచ్చాడు. ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా ఈ స్థాయిలో నిలబడినందుకు కివీస్ కుర్రాళ్లు గర్వపడుతుంటారని చెప్పుకొచ్చాడు సాంట్నర్.
