Nicholas Pooran vs Sunil Narine : 12 ఏళ్ల క్రితం ఇలాగే.. నరెన్ వర్సెస్ పూరన్.. ఫామ్‌లో లేని ఆటగాడిని సూపర్ ఓవర్‌లో పంపడం పై లక్నో కోచ్ షాకింగ్ కామెంట్స్..
12 ఏళ్ల క్రితం అంటే 2014లో కూడా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇలాగే సూపర్ ఓవర్ జరుగగా.. స్పిన్నర్ సునీల్ నరైన్ (Nicholas Pooran vs Sunil Narine) అద్భుతంగా మెయిడిన్ ఓవర్ వేశాడు. నాటి మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌లో నికోలస్ పూరన్ చాలా ఇబ్బంది పడ్డాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 27, 2026 / 08:18 AM IST
Nicholas Pooran is yet to score a single run against Sunil Narine in Super Overs
- ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన లక్నో, కేకేఆర్ మ్యాచ్
- ఇరు జట్ల స్కోర్లు సమం
- సూపర్ ఓవర్‌లో అద్భుత విజయం సాధించిన కేకేఆర్
Nicholas Pooran vs Sunil Narine : ఐపీఎల 2026 సీజన్‌లో ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత కిక్‌ను ఇచ్చింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు సమాన స్కోర్లను చేయగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్‌లో అద్భుతంగా ఆడిన కేకేఆర్ విజయాన్ని అందుకుంది. కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ సూపర్ ఓవర్‌ను చాలా అద్భుతంగా వేశాడు. తొలి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టి కేకేఆర్ విజయానికి బాటలు వేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రింకూ సింగ్ (83 నాటౌట్; 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్థశతకం బాదాడు. కామెరూన్ గ్రీన్ (34; 21 బంతుల్లో 3 సిక్సర్లు) రాణించాడు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టాడు. జార్జ్ లిండే ఓ వికెట్ సాధించాడు.
అనంతరం రిషబ్ పంత్ (42; 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఐడెన్ మార్‌క్రమ్ (31; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఆయుష్ బదోని (24; 19 బంతుల్లో 2 సిక్సర్లు) రాణించినప్పటికి కూడా మిగిలిన వారు విఫలం కావడంతో 156 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 155 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్ సాగిందిలా..
లక్నో తరుపున నికోలస్ పూరన్, మార్‌క్రమ్ లు బరిలోకి దిగారు. కేకేఆర్ తరుపున స్పిన్నర్ సునీల్ నరైన్ వేశాడు. తొలి బంతికే నికోలస్ పూరన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో బంతికి రిషబ్ పంత్ సింగిల్ తీశాడు. మూడో బంతికి మార్‌క్రమ్ భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద రోవ్‌మన్ పావెల్ అద్భుత బంతిని పట్టుకున్నాడు. అయితే.. అతడు బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ ఆవలకు వెళ్లే సమయంలో రింకూ సింగ్ వైపుగా బంతిని విసిరివేయగా రింకూ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో లక్నో సూపర్ ఓవర్‌లో 1 పరుగు మాత్రమే చేసింది. ఇక రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్ కొట్టి కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు.
ఫామ్‌లోని లేని నికోలస్ పూరన్ ను సూపర్ ఓవర్‌లో పంపడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 12 ఏళ్ల క్రితం అంటే 2014లో కూడా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇలాగే సూపర్ ఓవర్ జరుగగా.. స్పిన్నర్ సునీల్ నరైన్ అద్భుతంగా మెయిడిన్ ఓవర్ వేశాడు. నాటి మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌లో నికోలస్ పూరన్ చాలా ఇబ్బంది పడ్డాడు. తొలి నాలుగు బంతులను సరిగ్గా ఆడలేక పోయాడు. ఐదో బంతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ సారి తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు.
దీనిపైనే లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్‌కు ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం నికోలస్ పూరన్ ఫామ్‌లో లేడు. అదే సమయంలో నరైన్ బౌలింగ్‌లో అతడి రికార్డు ఏమంత గొప్పగా లేదు. మరి అతడిని ఎలా ఎంపిక చేశారు అని అడుగగా.. ప్రపంచ క్రికెట్‌లో అందరి కంటే నరైన్ గురించి ఎక్కువగా తెలిసిన వ్యక్తి నికోలస్ పూరన్ అని, కాబట్టి అతడే సరైన ఎంపిక అని తాము భావించామన్నాడు. అతడు నరైన్ పై విజయం సాధిస్తాడని ఆశించామన్నాడు.
Pooran vs Narine in super overs🥶
Balls- 7
Runs- 0
Wickets- 2 pic.twitter.com/o7zdA4Uy9V— Dinda Academy (@academy_dinda) April 26, 2026
‘అతను ఇంకా ఫామ్‌లోకి రాలేదని నాకు తెలుసు, ఆ విషయాన్ని నిక్కీనే ముందుగా ఒప్పుకుంటాడు. కానీ, సూపర్ ఓవర్‌ను ఎవరైనా సమర్థవంతంగా ఎదుర్కోగలరంటే అది నిక్కీ పూరన్ మాత్రమే అని మేము భావించాం. మన అత్యుత్తమ ఆటగాళ్లకు మనం అండగా ఉంటాం కదా? మనం చేయాల్సింది అదే. అయితే అతను ఇబ్బంది పడ్డాడు. కానీ అన్ని గణాంకాలను పరిశీలిస్తే.. ప్రపంచ స్థాయి ఆఫ్-స్పిన్నర్ అయిన సునీల్ నరైన్‌ను నిక్కీ కంటే బాగా ఎవరూ ఆడలేరు. దురదృష్టవశాత్తు అది ఫలించలేదు.’ అని జస్టిన్ లాంగర్ అన్నాడు.
ఇదిలా ఉంటే.. టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు సూపర్ ఓవర్‌లో స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఏడు బంతులు ఆడిన నికోలస్ పూరన్ ఒక్క పరుగు కూడా తీయలేదు. రెండు సార్లు ఔట్ అయ్యాడు.
