Ben stokes : అర్ధరాత్రి నైట్‌క్లబ్ గొడవ.. కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో బెన్‌స్టోక్స్‌? మ‌రో ఆట‌గాడిపై నిషేదం ప‌డ‌నుందా?

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ విజయం తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben stokes), ఆటగాడు గస్ అట్కిన్సన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు

Nightclub Controversy ecb investigation ben stokes captaincy Risk

  • అర్ధరాత్రి కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘన
  • బెన్ స్టోక్స్ కెప్టెన్సీకి తీవ్ర ముప్పు
  • కొత్త కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ అవకాశం!

Ben stokes :  న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ విజయం తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆటగాడు గస్ అట్కిన్సన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ఒక నైట్‌క్లబ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఒక గొడవ కారణంగా బెన్ స్టోక్స్ తన కెప్టెన్సీని కోల్పోయే ప్రమాదం ఏర్పడగా, అట్కిన్సన్‌ను జట్టు నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఈసీబీ ఇప్పటికే అధికారికంగా విచారణను ప్రారంభించింది.

చెల్సియాలోని ఒక నైట్‌క్లబ్‌లో సర్సన్స్ అకాడమీకి చెందిన ఒక రగ్బీ ఆటగాడితో ఈ ఇద్దరు క్రికెటర్లకు ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఆ రగ్బీ ఆటగాడు.. గస్ అట్కిన్సన్‌పై దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆటగాళ్లతో పాటు ఉన్న ఈసీబీ సెక్యూరిటీ గార్డుకు ఆ దెబ్బ తగిలింది. దీంతో సదరు గార్డును ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. గాయానికి కుట్లు వేయాల్సి వచ్చింద‌ట‌. అయితే ఈ గొడవలో బెన్ స్టోక్స్ కు కానీ, అట్కిన్సన్ కానీ ఎలాంటి గాయాలు కాలేద‌ని అంటున్నారు.

Arjun Tendulkar : టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్క‌ర్ పెను విధ్వంసం.. ఐపీఎల్‌లో ఓ రెండు మ్యాచ్‌లు ఆడుంటేనా?

ఈ ఘటనపై మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవకు క్రికెటర్లు కారణం కాదని, రగ్బీ ఆటగాడే ముందుగా రెచ్చగొట్టాడని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. సదరు రగ్బీ ఆటగాడికి గతంలోనే ఇలాంటి చెడ్డ పేరు ఉందని, కాబట్టి ఈ చిన్న విషయానికే ఇంగ్లాండ్ కెప్టెన్ తన పదవిని కోల్పోవడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, జట్టు క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించడంపై ఈసీబీ మాత్రం చాలా సీరియస్‌గా ఉంది. జూన్ 17 నుండి న్యూజిలాండ్‌తో ప్రారంభం కాబోయే రెండో టెస్టుకు ముందే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు మితిమీరిన మద్యం సేవించడం, క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు రావడంతో ఈసీబీ ఈ ఏడాది జనవరిలో కఠినమైన అర్ధరాత్రి కర్ఫ్యూ నిబంధనను తీసుకువచ్చింది. ఇప్పుడు స్వయంగా కెప్టెనే ఆ నిబంధనను ఉల్లంఘించడంతో బోర్డు కఠిన నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. ఒకవేళ బెన్ స్టోక్స్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పిస్తే, యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.