Rahane : రంజీట్రోఫీలో రహానే భీభత్సం..! ఇలా ఆడితే రీ ఎంట్రీ మరిచిపోవాల్సిందే..!
ప్రస్తుతం రహానే ఫామ్ చూస్తుంటే అతడిని ఎంపిక చేయకపోవడమే మంచిదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- January 19, 2024 / 05:25 PM IST
Ajinkya Rahane
Ajinkya Rahane : ఇటీవల భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఆ సమయంలో తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోగానే అందరి దృష్టి ఓ ఆటగాడిపై పడింది. అతడే సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే. అతడిని జట్టులోకి ఎంపిక చేసి ఉంటే ఇలా జరిగేది కాదని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు కొందరు అభిమానులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. కనీసం ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల మ్యాచ్ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయాలని సోషల్ మీడియా వేదికగా చాలా మంది కోరారు.
కాగా.. సెలక్టర్లు అతడిని మరోసారి పట్టించుకోలేదు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అతడికి చోటు లభించలేదు. ఈ నిర్ణయాన్ని పలువురు తప్పుబట్టగా రంజీట్రోఫీలో సత్తా చాటి మిగిలిన మూడు టెస్టుల్లో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. అయితే.. ప్రస్తుతం రహానే ఫామ్ చూస్తుంటే అతడిని ఎంపిక చేయకపోవడమే మంచిదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే అతడు వరుసగా రెండో సారి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడమే కారణం. ముంబై జట్టుకు కెప్టెన్ అయిన రహానే ఆంధ్రాతో జరిగిన మ్యాచులో మొదటి బంతికే ఔట్ కాగా.. నేటి నుంచి కేరళతో ప్రారంభమైన మ్యాచ్‌లో నూ ఫస్ట్ బాల్‌కే ఔట్ అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి బంతికే జై ఔట్ కాగా.. వన్‌డౌన్‌లో రహానే బరిలోకి దిగాడు. బాసిల్ థంపి బౌలింగ్‌లో వికెట్ కీపర్ సంజు శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బాల్‌కే రహానే ఔట్ కావడంతో ప్రస్తుతం అతడిపై విమర్శల జడివాన కొనసాగుతోంది. ఇలాగైతే రీ ఎంట్రీ కష్టమేనని, ఇక అతడి కెరీర్ ముగిసినట్లేనని అంటున్నారు. 100 టెస్టులు ఆడాలనే అతడి కల.. కలగానే మిగలనుందని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తన మొదటి ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసింది.
NZ vs PAK : గెలుపు సంగతే మరిచిపోయిన పాకిస్తాన్.. వరుసగా నాలుగో టీ20లోనూ ఓటమి..
