NZ vs PAK Match
T20 World Cup : టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సెమీస్ బెర్తులను తేల్చే సూపర్ -8 దశ మ్యాచ్‌లు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. కొలంబో వేదికగా పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఇవాళ రాత్రి జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ అధికారుల రిపోర్టు ప్రకారం స్పష్టమవుతోంది. ఒకవేళ భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే.. పాకిస్థాన్ జట్టు సెమీస్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వెదర్ రిపోర్టు ప్రకారం.. కొలంబోలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. స్థానిక సమయం ప్రకారం.. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయత్రం 5 నుంచి 6 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉంది. రాత్రి 7గంటల తరువాత అక్కడక్కడ వర్షాలు పడే చాన్స్ ఉంది. రాత్రి 8గంటల తరువాత కూడా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో భారీ వర్షం పడితే పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే సూపర్-8 మ్యాచ్‌లకు రిజర్వ్‌డే లేదు కాబట్టి.. పాకిస్థాన్ జట్టుకు ఇబ్బందికర పరిస్థితేనని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దయినా.. ఒకవేళ ఓడిపోయినా పాకిస్థాన్ జట్టుకు సెమీస్ ఆశలు క్లిష్టతరంగా మారనున్నాయి. పాకిస్థాన్ తన తరువాత రెండు మ్యాచ్‌లను ఇంగ్లాండ్, శ్రీలంక జట్లతో ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలో ఒక్కదానిలో ఓడిపోయినా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా.. పూర్తిస్థాయిలో సెమీస్ ఆశలు కోల్పోయినట్లే. దీంతో న్యూజిలాండ్ జట్టుపై జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ తప్పక గెలవాల్సిన పరిస్థితి అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
టీ20ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు 49సార్లు తలపడ్డాయి. 24 మ్యాచ్ లలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించగా.. 23సార్లు న్యూజిలాండ్ జట్టు గెలిచింది. రెండు మ్యాచ్ లు ఫలితం తేలలేదు. మరోవైపు.. గ్రూప్ దశలో పాకిస్థాన్ గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. భారత జట్టుపై ఓడిపోయిన ఆ జట్టు.. నెదర్లాండ్స్ పై అతి కష్టం మీద గెలిచింది. పాకిస్థాన్ జట్టుతో పోల్చితే గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేయకుంటే న్యూజిలాండ్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది.