Pakistan Captain Salman Ali Agha
IND vs PAK : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఓటమికి కారణాలను వివరించారు. వారి వల్లనే ఓడిపోయామంటూ కీలక కామెంట్స్ చేశాడు.
Also Read : IND vs PAK : పాక్‌పై భారత్ విజయం.. మైదానంలో టీమిండియా ప్లేయర్ల విన్యాసాలు చూశారా.. ఫొటోలు వైరల్
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్ ఆరంభించగా ఆదినేలో ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్ (40బంతుల్లో77) చేశాడు. సూర్యకుమార్ (32), దూబె (27), తిలక్ వర్మ (25) రాణించడంతో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు ఏ స్థితిలోనూ భారత జట్టుకు పోటీ ఇవ్వలేక పోయింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. దీంతో పాకిస్థాన్ జట్టు 18 ఓవర్లలోనే 114 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడాడు.
పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లుగా మేము బౌలింగ్, బ్యాటింగ్ చేయలేకపోయామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈరోజు మా స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయారు. అయితే, మా స్పిన్నర్లపై మాకు నమ్మకం ఉంది. గత ఆరు నెలలుగా వారు అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో మేము చాలా వికెట్లు కోల్పోయాం. అది మా జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది.’
తొలి ఇన్నింగ్స్ పిచ్ కొంచెం జిగటగా ఉంది. బంతి కూడా గ్రిప్ అయింది. కానీ, కండిషన్స్‌కు తగ్గట్టు మా బౌలర్లు రాణించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మెరుగ్గా సహకరించింది. అయినా, మేము సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఆశించిన స్థాయిలో మేము బ్యాటింగ్ చేయలేకపోయాం. ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచ్‌లలో భావోద్వేగాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. మేము ఇప్పటికే ఇలాంటి మ్యాచ్‌లు ఆడాం. ఇక రెండు రోజుల్లో మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ ఓటమిని మరిచి దానిపై దృష్టి పెట్టాలి. ఆ మ్యాచ్‌లో గెలిచి సూపర్ -8కు అర్హత సాధించడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం అంటూ సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.