Womens Asia Cup 2026 : ఆసియాకప్ 2026 కోసం పాకిస్థాన్ మాస్టర్ ఫ్లాన్..
మహిళల ఆసియా కప్ 2026 (Womens Asia Cup 2026) ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 25, 2026 / 12:47 PM IST
Pakistan womens team prepare for Asia Cup 2026 with T20 matches against men
Womens Asia Cup 2026 : మహిళల ఆసియా కప్ 2026 ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో విజయం సాధించేందుకు పాకిస్థాన్ మహిళల జట్టు మాస్టర్ ప్లాన్ వేసింది. పురుషుల జట్టుతో తమ టీమ్ ఒక టీ20 సిరీస్ ఆడిందని కెప్టెన్ ఫాతిమా సనా వెల్లడించారు.
లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఈ మ్యాచ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అబ్దుల్ ఖాదిర్ క్రికెట్ అకాడమీకి చెందిన యువ, సీనియర్ క్రీడాకారులతో కూడిన జట్టుతో పాకిస్థాన్ మహిళల జట్టు తలపడింది. పూర్తి స్థాయి టీ20 నిబంధనలతోనే రెండు మ్యాచ్‌లను నిర్వహించారు.
ఈ మ్యాచ్‌ల వెనుక ముఖ్య ఉద్దేశ్యం.. తమ జట్టును ఒత్తిడిలో పరీక్షించడమేనని కెప్టెన్ ఫాతిమా సనా తెలిపింది. కీలక సమయాల్లో ప్లేయర్లు ఒత్తిడికి గురై తప్పులు చేయకుండా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చింది.
‘మేము టోర్నమెంట్‌కు బాగా సిద్ధమయ్యాము. మేము అబ్బాయిలతో పోటీగా మ్యాచ్‌లు ఆడాము. వాటిలో మేము ఒత్తిడికి గురయ్యాము. ఈ అనుభవాలు పోటీలోని సవాళ్లకు అలవాటు పడటానికి మాకు సహాయపడతాయి.’ అని ఫాతిమా అంది.
ఆసియాకప్‌ను ఇప్పటి వరకు పాకిస్థాన్ మహిళల జట్టు ఒక్క సారి కూడా గెలవలేదు. 2012, 2016లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికి కూడా ఆ రెండు సార్లు భారత్ చేతుల్లోనే ఓడిపోయింది. గత రెండు ఎడిషన్లలోనూ సెమీ-ఫైనల్ దశలోనే నిష్క్రమించారు.
థాయ్‌లాండ్‌తో సెప్టెంబర్ 1న జరిగే మ్యాచ్ ద్వారా ఆసియాకప్ 2026లో పాకిస్థాన్ మహిళల జట్టు ప్రయాణం మొదలుకానుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్ల మధ్య సెప్టెంబర్ 5న మ్యాచ్ జరగనుంది.
