Pat Cummins : ఐదేళ్ల క్రితం ఐపీఎల్‌కు, ఇప్ప‌టి ఐపీఎల్‌కు చాలా తేడా.. వాళ్ల‌కు బౌలింగ్ చేయ‌నందుకు సంతోషం.. పాట్ క‌మిన్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ముంబై పై విజ‌యం సాధించ‌డం ప‌ట్ల స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ (Pat Cummins) ఆనందం వ్య‌క్తం చేశాడు.

Pat Cummins key Comments after Sunrisers Hyderabad beat Mumbai Indians in IPL 2026 (pic credit@ipl)

  • ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా ఐదో విజ‌యాన్ని సాధించిన స‌న్‌రైజ‌ర్స్
  • ఆనందాన్ని వ్య‌క్తం చేసిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ క‌మిన్స్‌

Pat Cummins : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో అద‌ర‌గొడుతోంది. బుధ‌వారం వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. స‌న్‌రైజ‌ర్స్ కు ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా ఐదో విజ‌యం కాగా.. మొత్తంగా ఆరోది. ముంబై పై విజ‌యం సాధించ‌డం ప‌ట్ల స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ ఆనందం వ్య‌క్తం చేశాడు. ఐదేళ్ల క్రితం ఐపీఎల్‌కు ఇప్ప‌టి ఐపీఎల్‌కు ఎంతో తేడా ఉంద‌న్నాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 243 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో ర్యాన్ రికెల్టన్ (123; 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. విల్ జాక్స్ (22 బంతుల్లో 46 ప‌రుగులు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 31 ప‌రుగులు) వేగంగా ఆడారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో ప్రఫుల్ హింజ్ రెండు, మ‌లింగ‌, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ రెడ్డి లు త‌లా ఓ వికెట్ తీశారు.

PBKS vs RR : అర్ష్‌దీప్ సింగ్ ఎంత ప‌ని చేశావ‌య్యా.. పాపం బుడ్డోడు.. చారిత్రాత్మ‌క ‘సెంచ‌రీ’ రికార్డు జ‌స్ట్ మిస్‌..

అనంత‌రం 244 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 18.4 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ (76; 30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్; 30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాలు బాద‌గా.. అభిషేక్ శ‌ర్మ (45; 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), స‌లీల్ అరోరా (30; 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) దంచికొట్టారు. ముంబై బౌల‌ర్ల‌లో ఘజన్‌ఫర్ రెండు, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

మ్యాచ్ అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ మాట్లాడుతూ ముంబై విజ‌యం సాధించ‌డం ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. నిజం చెప్పాలంటే ఈ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డం కాస్త క‌ష్ట‌మ‌ని అనిపించింది. అయితే.. పిచ్ చాలా బాగుంది. ఇక మా బ్యాటింగ్ లైన‌ప్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఈ పిచ్ పై ఈ ల‌క్ష్యాన్ని ఛేదించ‌వ‌చ్చున‌ని అనిపించింది.

ఇక ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌ల పై క‌మిన్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. వాళ్లు నిర్భయంగా ఆడుతున్నార‌న్నాడు. పిచ్ బాగున్నప్పుడు వాళ్ళు ఆడే విధానం చూసేందుకు చాలా బాగుంటుంద‌న్నాడు. వాళ్ల అమ్ముల పొద‌లో ఎన్నో ర‌కాల షాట్లు ఉన్నాయ‌న్నాడు. ఆ ఇద్ద‌రికి బౌలింగ్ చేయనందుకు తాను సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు.

ఐదేళ్ల క్రితానికి, ఇప్ప‌టికి ఎంతో తేడా

ఇక యువ ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నార‌ని కితాబు ఇచ్చాడు. సలీల్ (అరోరా)కు ఈ సీజన్‌లో ఇంకా పెద్దగా అవకాశం రాలేదు, కానీ ప్రీ-సీజన్‌లో బాగా ఆకట్టుకున్నాడు. వాళ్లందరిలో ఆ నిర్భయ వైఖరి ఉంది. కాబట్టి ఈ యువకులలో ఆ వైఖరిని నింపినందుకు కోచింగ్ సిబ్బందికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్లు ఎంత గొప్పవాళ్ళో వాళ్లకు తెలియదని నేను అనుకుంటున్నాను. అని క‌మిన్స్ అన్నాడు.

Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్‌ది మామూలు అదృష్టం కాద‌య్యా.. స‌న్‌రైజ‌ర్స్ పై ఓట‌మి.. అయినా గానీ ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు..

ఇక ఐదేళ్ల క్రితం ఐపీఎల్‌కు ఇప్ప‌టి ఐపీఎల్‌కు చాలా తేడా ఉంద‌న్నాడు. ఐదేళ్ల క్రితం ఐపీఎల్‌కు, ఇప్పటి ఐపీఎల్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఓవ‌ర్‌కు 12 పైగా పరుగులు చేయాల్సి ఉన్నా కూడా ఓ బ్యాటింగ్ యూనిట్‌గా దాన్ని ఛేజ్ చేయ‌గ‌ల‌మ‌నిస్తుంది. కాబట్టి బౌలింగ్ గ్రూప్‌గా మీరు మీ అంచనాలను కొద్దిగా మార్చుకోవాలి. ఓ బౌల‌ర్‌గా బౌల‌ర్ల పై నాకు చాలా సానుభూతి ఉంది. నేను గత మ్యాచ్‌లో చెప్పాను. ఇవి ఎక్కువ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌లు. కాబ‌ట్టి బౌలర్లకు పెద్దగా అవకాశం ఉండదు. కానీ చివరి క్షణంలో కూడా మీరు ఒక మంచి యార్కర్‌ను సంధించగలిగితే, అదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించగలదని అనిపిస్తుంది. ఉదాహరణకు మన జట్టులోని ఈషాన్ (మలింగ) తీసుకుంటే.. ఈ మ్యాచ్‌లు గెలవడానికి అతను కూడా ఒక ముఖ్య కారణం. అతనికి పర్పుల్ క్యాప్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అని క‌మిన్స్ అన్నాడు. ప్ర‌స్తుతం అంతా బాగానే జ‌రుగుతోంద‌ని, ఇలాగే కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పుకొచ్చాడు.