Pat Cummins : గుజరాత్ పై ఘోర ఓటమి.. స్పందించిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్.. ఎంతో సంతోషంగా ఉంది..
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర ఓటమిపై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 13, 2026 / 07:40 AM IST
Pat Cummins key comments after Sunrisers Hyderabad massive defeat against Gujarat Titans (pic credit@ipl)
- గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర ఓటమి
- స్పందించిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్
- బ్యాటర్లను నిందించాల్సిన పని లేదు
- ఓటమిని మరిచిపోయి ముందుకు సాగుతాం
Pat Cummins : ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 83 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. గుజరాత్ బౌలర్ల అద్భుత ప్రదర్శనే తమ ఓటమికి కారణం అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇంతటి అత్యుత్తమ బౌలింగ్‌ను చూసి ఉండరని చెప్పుకొచ్చాడు. సాధ్యమైనంత త్వరగా ఈ ఓటమిని మరిచిపోతామన్నాడు.
సాయి సుదర్శన్ (61; 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (50; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. పాట్ కమిన్స్ ఓ వికెట్ సాధించాడు.
ఆ తరువాత గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో 169 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, రషీద్ ఖాన్ తలా ఓ వికెట్ సాధించారు.
ప్రత్యర్థిని తక్కువకే కట్టడి చేయడంతో సంతోషించా
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడాడు. పేలవ ప్రదర్శన చేసిన తమ బ్యాటర్లను వెనకేసుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో రాణించనంత మాత్రాన బ్యాటర్లను నిందించాల్సిన పని లేదన్నాడు. తొలుత ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయడంతో ఎంతో సంతోషంగా ఉన్నాను. ‘గుజరాత్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ వికెట్ బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా ఉంది. పరిస్థితులను గుజరాత్ బౌలర్లు చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఆ స్పెల్‌ను ఎదుర్కొనే మార్గాలను మేము ఖచ్చితంగా అన్వేషించాలి. ‘అని కమిన్స్ అన్నాడు.
‘ఈ గెలుపు క్రెడిట్ ఖచ్చితంగా గుజరాత్ బౌలర్లకు ఇవ్వాల్సిందే. బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్‌లో బాల్ వేసినప్పుడు బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డారు. గుజరాత్ బౌలర్లు మాకు ఎక్కువ పరుగులు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. వారు బౌలింగ్ చేసిన విధానం చూసిన తరువాత మా బౌలర్లు ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను. ఏదీ ఏమైనప్పటికి కూడా టీ20 క్రికెట్‌లో ఇంతకంటే అత్యుత్తమ బౌలింగ్‌ను చూసి ఉండరు.’ అని కమిన్స్ తెలిపాడు.
తమ బ్యాటింగ్ ఆర్డర్ పై ఎంతో నమ్మకం ఉందన్నాడు. టీ20 క్రికెట్‌లో అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుందన్నాడు. తమ టాప్ ఆర్డర్‌లోని నలుగురు బ్యాటర్లు ఈ సీజన్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు సాధించారని గుర్తు చేశాడు. వారంతా మంచి ఫామ్‌లోనే ఉన్నారన్నాడు. ఒక్క వైఫల్యంతో వారిని నిందించాల్సిన పని లేదన్నాడు. తరువాత మ్యాచ్‌లు తెలిసిన వేదికల్లో జరుగుతుండడం తమకు కలిసి వస్తుందన్నాడు.
ఇక ప్లేఆఫ్స్ అవకాశాలపై మాట్లాడుతూ ఎలాంటి ఆందోళన లేదన్నాడు. సీజన్ ఆరంభంలోనే ఎక్కువ విజయాలు సాధించడం ముఖ్యమన్నాడు. గత ఏడు మ్యాచ్‌ల్లో తాము ఐదు లేదా ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించామన్నాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు ఉన్నాయని వాటిలో విజయం సాదించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంటామనే ధీమాను వ్యక్తం చేశాడు. ఏదీఏమైనప్పటికి కూడా ఈ ఓటమిని త్వరగా మరిచిపోయి తదుపరి మ్యాచ్‌లకు సిద్ధం అవుతామని చెప్పుకొచ్చాడు.
