IND vs PAK : ముఖం చూపించలేక.. మ్యాచ్ మధ్యలో వెళ్లిపోయిన మోసిన్ నఖ్వీ.. తట్టాబుట్టా సర్దుకుని ఇస్లామాబాద్ విమానం ఎక్కేశాడు..!
ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పై 61 పరుగుల తేడాతో భారత్ (IND vs PAK)గెలుపొందింది.
- Thota Vamshi Kumar
- Updated on- February 16, 2026 / 09:12 AM IST
PCB Chairman Mohsin Naqvi left stadium during IND vs PAK clash
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పై 61 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (77; 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకం బాదాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32; 29 బంతుల్లో 3 ఫోర్లు), తిలక్ వర్మ (25; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబె (27; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు తీశాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
T20 World Cup 2026 : దంచికొట్టిన షై హోప్, హెట్‌మయర్.. టీ20 ప్రపంచకప్ నుంచి నేపాల్ ఔట్..
అనంతరం 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ (44; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. షాహీన్ అఫ్రిది (23 నాటౌట్; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ సాధించారు.
ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లలో పాక్ పై భారత ఆధిపత్యం 8-1కి చేరింది.
మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన పీసీబీ చీఫ్..
ఈ మ్యాచ్‌కు ముందు ఎంతో డ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు ప్రధాన సూత్రధారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ అన్నసంగతి తెలిసిందే. అయితే..ఐసీసీ జోక్యంతో పాక్ ప్రభుత్వం మెట్టు దిగి వచ్చింది.
ఇక మ్యాచ్‌లో తమ జట్టు గెలిస్తే ఓవర్ యాక్షన్ చేద్దామనుకున్న పీసీబీ చీఫ్ నఖ్వీకి భారత ప్లేయర్లు గట్టి షాక్ ఇచ్చారు. తమ జట్టు ఓటమి ఖాయమైన నేపథ్యంలో మ్యాచ్ పూర్తి కాకముందే అతడు కొలంబోని ప్రేమదాస స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. టీమ్ఇండియా ప్లేయర్ల దెబ్బకు మ్యాచ్ ముగియక ముందే తట్టాబట్టా సర్దుకుని ఇస్లామాబాద్ విమానం ఎక్కాడంటూ భారత అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.
