Babar Azam : ల‌క్కంటే నీదేరా ఆజామూ.. ఫైన‌ల్ మ్యాచ్‌లో డ‌కౌట్‌.. అయినా గానీ క‌ప్పు ఎత్తేశావ్‌గా..

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ 2026 విజేత‌గా బాబ‌ర్ ఆజామ్ (Babar Azam)నాయ‌క‌త్వంలోని పెషావ‌ర్ జ‌ల్మీ నిలిచింది

Peshawar Zalmi won the PSL 2026 Title

  • పీఎస్ఎల్ 2026 విజేత‌గా పెషావ‌ర్ జ‌ల్మీ
  • బాబ‌ర్ ఆజామ్ సార‌థ్యంలో
  • ఫైన‌ల్ మ్యాచ్‌లో హైద‌రాబాద్ పై విజ‌యం

Babar Azam : పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ 2026 విజేత‌గా బాబ‌ర్ ఆజామ్ నాయ‌క‌త్వంలోని పెషావ‌ర్ జ‌ల్మీ నిలిచింది. ఆదివారం క‌రాచీలోని గడ్డాఫీ స్టేడియం వేదిక‌గా హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ జ‌ట్టుతో ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. కాగా.. పీఎస్ఎల్‌ను క‌ప్పును కైవ‌సం చేసుకోవ‌డం పెషావ‌ర్ జల్మీకి ఇది రెండో సారి కాగా.. నాయకుడిగా బాబ‌ర్ ఆజామ్ కప్పును ముద్దాడ‌డం ఇదే తొలిసారి.

గెలుపు అనంత‌రం పెషావ‌ర్ జ‌ల్మీ ప్లేయ‌ర్ల సంబ‌రాలు అంబరాన్ని అంటాయి. త‌మ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌ను (Babar Azam) ప్లేయ‌ర్లు భుజాల‌పైకి ఎత్తుకుని మైదానం అంత‌టా తిరిగారు.

MI vs LSG : ముంబైతో మ్యాచ్‌కు ముందు స‌చిన్ టెండూల్క‌ర్ ఇంటికి ల‌క్నో ఆట‌గాళ్లు..

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ 18 ఓవ‌ర్ల‌లో 129 ప‌రుగుల‌కే ఆలౌటైంది. హైద‌రాబాద్ ఆట‌గాళ్ల‌లో సైమ్ అయూబ్ (54; 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. పెషావ‌ర్ జ‌ల్మీ బౌల‌ర్ల‌లో ఆరోన్ హార్డీ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. నహిద్ రానా రెండు వికెట్లు తీశాడు. సుఫియాన్ ముఖీమ్, మహ్మద్ బాసిత్ లు చెరో వికెట్ సాధించారు.

అనంత‌రం ఆరోన్ హార్డీ (56 నాటౌట్; 39 బంతుల్లో 9 ఫోర్లు) హాప్ సెంచ‌రీ చేయ‌గా అబ్దుల్ సమద్ (48; 34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించ‌డంతో 130 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.2 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి పెషావ‌ర్ జ‌ల్మీ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పెషావ‌ర్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ డ‌కౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే గోల్డెన్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో మహ్మద్ అలీ మూడు వికెట్లు తీశాడు.