PSL 2026 : పాయె.. మరోసారి పీఎస్ఎల్ పరువు పాయె.. బాల్ ట్యాంపరింగ్ చేస్తూ వీడియోలో అడ్డంగా దొరికిపోయిన స్టార్ ప్లేయర్..!
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 (PSL 2026) పరువు మరోసారి బజారున పడింది.
- Thota Vamshi Kumar
- Published On : March 30, 2026 / 09:12 AM IST
PSL 2026 Lahore Qalandars vs Karachi Kings Fakhar Zaman Ball Tampering videos viral
PSL 2026 : పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 పరువు మరోసారి బజారున పడింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో తెలుగు బంతి కాస్త గులాబి రంగులోకి మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. మ్యాచ్ సమయంలోనే దీన్ని గుర్తించిన అంపైర్లు ఐదు పరుగుల పెనాల్టీని విధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..?
ఆదివారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఖలందర్స్ బ్యాటర్లలో అబ్దుల్లా షఫిక్ (33), హసీబుల్లా ఖాన్ (28) లు రాణించారు. కరాచీ కింగ్స్ బౌలర్లలో మొయిన్ అలీ, మీర్ హంజా, ఆడమ్ జంపా లు తలా రెండు వికెట్లు తీశారు. హసన్ అలీ, సల్మాన్ అఘా, అబ్బాస్ అఫ్రిది లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత 129 పరుగుల లక్ష్యంతో కరాచీ కింగ్స్ బరిలోకి దిగింది. 19 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు సాధించింది. దీంతో ఆఖరి ఓవర్‌లో 6 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఈ దశలో ఆఖరి ఓవర్‌ను వేసేందుకు హరీస్ రవూఫ్ సిద్ధం అవుతున్నాడు. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది అతడికి కొన్ని సూచనలు చేస్తున్నాడు.
This is so Shameful
— Ehtisham Siddique (@iMShami_) March 29, 2026
ఈ సమయంలో హరీస్ రవూఫ్ నుంచి బంతి తీసుకున్న సీనియర్ ఆటగాడు ఫఖర్ జమాన్ తన గోళ్లతో బంతి రూపు రేఖలను (ట్యాంపరింగ్ )మార్చే ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన ఆన్ ఫీల్డ్ అంపైర్ పైసల్ అఫ్రిది బంతిని వారి వద్ద నుంచి తీసుకుని మరో ఆన్‌ఫీల్డ్ అంపైర్ షర్ఫుద్దౌలాతో సుదీర్ఘంగా చర్చించాడు. బంతిని ఉద్దేశపూర్వకంగానే మార్చారని ఇద్దరు అంపైర్లు నిర్ధారించారు. వెంటనే బంతిని మార్చడంతో పాటు ప్రత్యర్ధి జట్టు అయిన కరాచీ స్కోరు బోర్డుకు ఐదు పరుగులు యాడ్ చేశారు.
దీంతో కరాచీ విజయలక్ష్యం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. మూడు బంతుల్లోనే 9 పరుగులు చేసి 19.3 ఓవర్లనే విజయాన్ని అందుకుంది కరాచీ కింగ్స్.
ఇక దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో జరిగిన క్రమ శిక్షణా విచారణలో తనపై వచ్చిన ఆరోణలను ఫఖర్ జమాన్ ఖండించినట్లు తెలిపింది. రాబోయే 48 గంటల్లో మరో విచారణ జరగనుందని, ఆ తరువాత మ్యాచ్ రిఫరీ తన తీర్పును వెల్లడిస్తాడని చెప్పుకొచ్చింది. నేరం రుజువైతే.. ఫఖర్ పై ఓ మ్యాచ్ నిషేదం పడే అవకాశం ఉంది.
