Rajat Patidar : మాకు తెలుసు.. ఆ ముగ్గుర్ని ఔట్ చేస్తే గుజరాత్ పని ఖతం.. రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
గుజరాత్ పై విజయం సాధించడం ఆనందంగా ఉందని, పక్కా ప్రణాళికలతోనే ఫైనల్‌కు చేరుకున్నామని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 27, 2026 / 07:38 AM IST
Rajat Patidar key comments after RCT beat in Qualifier 1 in IPL 2026 (pic credit@ipl)
- క్వాలిఫయర్ -1లో గుజరాత్ పై విజయం
- ఫైనల్ చేరుకున్న ఆర్‌సీబీ
- కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక వ్యాఖ్యలు
Rajat Patidar : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. గుజరాత్ పై విజయం సాధించడం ఆనందంగా ఉందని, పక్కా ప్రణాళికలతోనే ఫైనల్‌కు చేరుకున్నామని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.
కెప్టెన్ రజత్ పాటిదార్ (93 నాటౌట్; 33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లీ (43 ;25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్). కృనాల్ పాండ్యా (43; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశాడు. ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్‌సీబీ 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో రాహుల్ తెవాటియా (68; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకఫ్ డఫీ మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ సాధించాడు.
పవర్ ప్లేలో ఆ ముగ్గుర్ని ఔట్ చేస్తే..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఫైనల్ చేరుకోవడం పై ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గుజరాత్‌లో టాప్-3 బ్యాటర్లు ఔట్ చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చుననే విషయం తమకు బాగా తెలుసునని, పక్కా ప్రణాళికలతోనే విజయం సాధించామన్నాడు.
ఇది మాకు ఒక అద్భుతమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించిన తీరు అమోఘం. ప్రతి బ్యాటర్ కూడా బాదుడు పనిగా పెట్టుకున్నారు. ఇది మాకు బాగా కలిసి వచ్చింది. అని అన్నాడు. ఇక గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడి చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఏమీ లేదన్నాడు. అదే సమయంలో ప్రత్యర్థి ఎవరైనా వా బౌలర్లపై విరుచుకుపడేందుకు తాము సిద్ధంగా ఉండాలని మాత్రం అనుకున్నామని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన సమావేశంలో ఈ విషయం పై చాలా స్పష్టంగా మాట్లాడుకున్నామని తెలిపాడు.
క్వాలిఫయర్ 1 లాంటి పెద్ద మ్యాచ్‌లో తాము ఆడిన తీరు, మ్యాచ్‌లో తాము చెలాయించిన ఆధిపత్యం పట్ల ఆనందంగా ఉంద్నాడు. ఇక తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ. తన బ్యాటింగ్ శైలి ఇలాగే ఉంటుందన్నాడు. తాను క్రీజులోకి వెళ్లిన తరువాత వికెట్ ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు ఓ 8 నుంచి 10 బంతులు తీసుకుంటానని చెప్పాడు. దీంతో తనకు వికెట్ పై అవగాహన వస్తుందని, ఎలా ఆడాలనే విషయం అర్థమవుతుందన్నాడు.
తాను పిచ్ ఎలా స్పందిస్తుందో అన్న ఆందోళన చెందనన్నాడు. ఎల్లప్పుడూ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. ఈ పిచ్ పై ఫ్రంట్ ఫుట్ వచ్చి సిక్సర్లు కొట్టడం అంత సులభం కాదన్నాడు. బౌన్స్ చాలా చక్కగా ఉందన్నాడు. తమ బౌలర్లు ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారన్నాడు.
ఇప్పటి వరకు గుజరాత్ ఆడిన తీరును పరిశీలిస్తే.. ఆ జట్టులోని టాప్-3 ఆటగాళ్లను పవర్ ప్లేలోనే ఔట్ చేయాలని తాము స్పష్టంగా అనుకున్నామని, అలా చేసినందుకు ఆనందంగా ఉందన్నాడు. ఇక రొమారియోను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావడంపై మాట్లాడుతూ.. మిడిల్ ఓవర్లలో ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్ వేయాల్సి వస్తే రొమారియో ఎలా బంతులు వేస్తాడో తెలుసుకునేందుకే ఇలా చేశామన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు.
