Ravindra Jadeja : రాజ్‌కోట్‌లో చిరు ఇంద్ర సినిమా సీన్.. జడేజా యాక్షన్ వేరేలెవల్!
బ్యాటింగ్‌లో శతకం, బౌలింగ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు జడేజా.
- Thota Vamshi Kumar
- Published on- February 19, 2024 / 12:26 PM IST
Ravindra Jadeja kissing the Rajkot pitch
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఇంద్ర సినిమాకు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో చిరు చాలా రోజుల తరువాత తన ఊరికి వస్తాడు. హెలికాఫ్టర్‌లోంచి కిందకు దిగిన తరువాత అక్కడ ఉన్న ప్రజలను, తన ఊరిని చూసిన ఆనందంలో పులకరించిపోతాడు. దీంతో నేలకు ముద్దు పెడతాడు. థియేటర్‌లో ఈ సీన్ చూసిన చాలా మందికి గూస్‌బంప్స్ వచ్చాయి. తాజాగా రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లోనూ అలాంటి ఓ దృశ్యం ఆవిషృతమైంది.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత విజయంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, కెప్టెన్ రోహిత్ శర్మ లతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ తో కలిసి జడేజా జట్టును ఆదుకున్నాడు. శతకంతో చెలరేగాడు.
IND vs ENG : రాజ్‌కోట్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన.. భార్య రివాబా ఆసక్తికర ట్వీట్
ఇక రెండో ఇన్నింగ్స్‌లో 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో భారత జట్టు తన టెస్టు క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. మార్క్‌వుడ్ ఆఖరి వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. జడేజా అతడిని ఔట్ చేశాడు. జడ్డూకు ఈ ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్.
బ్యాటింగ్‌లో శతకం, బౌలింగ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు జడేజా. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అద్భుత ప్రదర్శన, గెలిచిన ఆనందంతో అతడు రాజ్‌కోట్ మైదానంలో కూర్చుండిపోయి పిచ్ కు ముద్దులు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చిరంజీవి సినిమాలో చేస్తే.. జడేజా నిజజీవితంలో చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. రాజ్‌కోట్ రవీంద్ర జడేజాకు హోం గ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే.
