RCB : ఆర్‌సీబీ రికార్డు సేఫ్.. ఇక ఎవరి వల్ల కాదేమో..?
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB )జట్టు అదరగొడుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 28, 2026 / 09:02 AM IST
RCB Lowest total in Indian Premier League safe dehli all out for 75 (pic credit@ipl)
- ఐపీఎల్‌లో అత్యల్ప పరుగుల రికార్డు ఇంకా ఆర్‌సీబీ పేరుపైనే
- సోమవారం తృటిలో ఈ ముప్పును తప్పించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ ఓ దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరును ఢిల్లీ క్యాపిటల్స్ నమోదు చేస్తుందా? అన్న ఆసక్తి ఏర్పడింది.
అయితే.. అభిషేక్ పోరెల్ (30; 33 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (19; 18 బంతుల్లో 3 ఫోర్లు), కైల్ జేమీసన్ (12; 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) లు ఓ మోస్తరుగా రాణించడంతో 50 పరుగుల మైలురాయిని దాటి ముప్పును తప్పించుకుంది. ఆఖరికి 16.3 ఓవర్లలో 75 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ నాలుగు, భువనేశ్వర్ కుమార్ మూడు, రసిఖ్ సలాం దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా లు తలా ఓ వికెట్ తీశారు.
ఆ తరువాత దేవ్‌దత్ పడిక్కల్ (13 బంతుల్లో 34 నాటౌట్), విరాట్ కోహ్లీ (15 బంతుల్లో 23 నాటౌట్), జాకబ్ బెథెల్ (11 బంతుల్లో 20పరుగులు) లు రాణించడంతో 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది.
ఆర్‌సీబీ రికార్డు సేఫ్..
ఐపీఎల్‌లో అత్యల్ప పరుగుల రికార్డు ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీదే ఉంది. 2017లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 49 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 131 పరుగులు చేయగా ఆర్‌సీబీ 49 పరుగులకే ఆలౌట్ కావడంతో 82 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.
Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ వంటి జట్లు పలు జట్లు ఐపీఎల్ అత్యల్ప స్కోర్లను నమోదు చేస్తాయని భావించగా తృటిలో ఈ ఘోర ముప్పును తప్పించుకున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ముప్పును తప్పించుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా.. రికార్డు ఏదైనా కానీ అది గొప్పదైనా, మరేదైనా ఆర్‌సీబీ పేరు పైనే ఉండాలని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్లు ఇవే..
* ఆర్‌సీబీ – 49 పరుగులు (2017లో కేకేఆర్ పై)
* రాజస్థాన్ రాయల్స్ – 58 పరుగులు (2009లో ఆర్‌సీబీపై)
* రాజస్థాన్ రాయల్స్ – 59 పరుగులు (2023లో ఆర్‌సీబీ పై)
* డిల్లీ డేర్ డెవిల్స్ – 66 పరుగులు (2017లో ముంబై పై)
* ఢిల్లీ డేర్ డెవిల్స్ – 67 పరుగులు (2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై)
* కేకేఆర్ – 67 పరుగులు (2008లో ముంబై పై)
