Rinku Singh : టీ20 ప్రపంచకప్‌లో దక్కని చోటు.. ఎట్టకేలకు మౌనం వీడిన రింకూ సింగ్.. రోహిత్ ఇలా అన్నాడట..
ప్రపంచకప్ జట్టులో ఎంపిక కాకపోవడంపై మొదటి సారి రింకూ సింగ్ స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Published On : May 28, 2024 / 01:16 PM IST
Rinku Singh breaks silence on T20 World Cup snub
Rinku Singh – Rohit Sharma : ఐపీఎల్ ముగిసింది. మరో ఐదు రోజుల్లో టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ పొట్టి ప్రపంచకప్ భారత కాలమానం ప్రకారం జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు ఇప్పటికే అమెరికాకు చేరుకుంది. కాగా.. ఈ టోర్నీకి ఖచ్చితంగా ఎంపిక అవుతాడని భావించిన నయా ఫినిషర్ రింకూ సింగ్‌కు 15 మంది సభ్యులు గల బృందంలో స్థానం దక్కని సంగతి తెలిసిందే.
అయితే.. రిజ్వర్ జాబితాలో అతడికి సెలక్టర్లు చోటి ఇచ్చారు. అంటే.. 15 మంది సభ్యులు గల బృందంలో ఎవరైనా గాయపడినా, లేక మరేదైన కారణంతో అందుబాటులో లేకుంటే అప్పుడు వారి స్థానంలో రింకూ సింగ్‌ను తీసుకుంటారు. కాగా.. రింకూ సింగ్ ను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
స్పందించిన రింకూ సింగ్..
ప్రపంచకప్ జట్టులో ఎంపిక కాకపోవడంపై మొదటి సారి రింకూ సింగ్ స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తనతో ఏం చెప్పాడనే విషయాన్ని వెల్లడించాడు. పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడం తనకు బాధ కలిగించిందన్నాడు. మనం ఎంత బాగా ఆడుతున్నప్పటికీ ఎంపిక కాకపోతే సహజంగా ఎవరైనా బాధపడతారన్నాడు. ఇందులో సెలక్టర్ల తప్పేం లేదన్నాడు. టీమ్ కాంబినేషన్ కారణంగానే తనకు జట్టులో చోటు దక్కలేదన్నాడు.
ఈ విషయం పై మొదట్లో కొంచెం బాధపడ్డానని వెల్లడించాడు. మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నిర్ణయించుకుని, తనకు తానే సర్దిచెబుకున్నానని అన్నాడు. ఏం జరిగినా అంతా మన మంచికే అని అనుకున్నట్లు తెలిపాడు. ఇక రోహిత్ శర్మ తనకు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదన్నాడు. సెలక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించవద్దని సూచించాడు. నీ ప్రయత్నాన్ని కొనసాగించు. పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మరో రెండు సంవత్సరాల తరువాత మళ్లీ ప్రపంచకప్ ఉంటుంది అని రోహిత్ తనతో అన్నట్లు రింకూ సింగ్ చెప్పాడు.
Viral Video : ఈవీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. రనౌట్ చేసేందుకు చిన్నారుల పాట్లు.. అయ్యో పాపం
