Rinku Singh : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల 2027 వ‌న్డే ప్రపంచ కప్ అవకాశాలపై రింకూ సింగ్ కామెంట్స్ వైర‌ల్..

టెస్టు క్రికెట్‌లో భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాల‌నే త‌న ఆకాంక్ష‌ను టీమ్ఇండియా ప్లేయ‌ర్ రింకూ సింగ్ (Rinku Singh ) వెల్ల‌డించాడు.

Rinku Singh desire to see Rohit Sharma and Virat Kohli lift the 2027 ODI World Cup title

Rinku Singh : టెస్టు క్రికెట్‌లో భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాల‌నే త‌న ఆకాంక్ష‌ను టీమ్ఇండియా ప్లేయ‌ర్ రింకూ సింగ్ వెల్ల‌డించాడు. తాను కేవ‌లం ఒకే ఫార్మాట్ కు (టీ20) ప‌రిమిత‌మైన ఆట‌గాడిన‌నే అభిప్రాయం చాలా మందిలో ఉంద‌ని, అయితే.. తాను మూడు ఫార్మాట్ల‌లో ఆడ‌గ‌ల‌న‌ని చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్‌లు సహా మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నానని చెప్పాడు.

‘నేను కేవలం ఒకే ఫార్మాట్ ఆటగాడిననే అభిప్రాయం కొంత మందిలో ఉంది. దేశవాళీ క్రికెట్‌లో వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్‌ల్లో నా సగటును ఓ సారి చూడండి. భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడాలన్నది నా కల. కాబట్టి నన్ను ఒకే ఫార్మాట్ ఆటగాడిగా చూడకూడదు. నేను మూడు ఫార్మాట్లలోనూ ఆడగలను. దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాను. ప్రస్తుతం భారత్ తరఫున మాత్రం ఒక ఫార్మాట్‌లోనే ఆడుతున్నాను. అని రింకూ సింగ్ జియోతో మాట్లాడుతూ చెప్పాడు.

రింకూసింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 48 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 35 ఇన్నింగ్స్‌లలో 36.94 సగటు, 156.34 స్ట్రైక్‌రేట్‌తో 702 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. రెండు వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 55 పరుగులు చేశాడు.

Vaibhav Sooryavanshi : సంజూ శాంస‌న్ ప్లేస్‌లో కాదు.. ఆ స్టార్ ఆట‌గాడి స్థానంలో వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు ?

దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రింకూ సింగ్‌కు మంచి రికార్డు ఉంది. 53 మ్యాచ్‌ల్లో 76 ఇన్నింగ్స్‌ల్లో 58.70 స‌గ‌టుతో 3,757 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో 70 మ్యాచ్‌లు ఆడాడు. 64 ఇన్నింగ్స్‌ల‌లో 52.56 సగటు, 101.17 స్ట్రైక్‌రేట్‌తో 2,418 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 21 అర్ధశతకాలు బాదాడు.

2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీని చూడాలనుకుంటున్నా..

దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత్ తరఫున ఆడి టైటిల్ గెలవాలని రింకూ సింగ్ ఆకాంక్షించాడు.

‘విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ ఇద్దరూ దిగ్గ‌జాలు. వాళ్లు ప్రపంచకప్‌లో ఆడాలని, ప్రపంచకప్ గెలిచే జట్టులో భాగం కావాలనేది కేవ‌లం నా కోరిక మాత్ర‌మే కాదు యావ‌త్ దేశం కోరుకుంటుంది. ఎవ‌రికి తెలుసు. బ‌హుశా అదే వారి చివ‌రి ప్ర‌పంచ క‌ప్ కావ‌చ్చు. కాబ‌ట్టి వాళ్లు ఆడి గెలిస్తే అది గొప్ప సంద‌ర్భం అవుతుంది. 2011లో చివరిసారి మ‌నం వ‌న్డే ప్రపంచకప్ గెలిచాం. అందుకే వాళ్లు జట్టుతో ఉండి ఆ ట్రోఫీని అందుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం.’ అని రింకూ తెలిపాడు.