Riyan Parag : మమ్మల్ని ఇంటికి పోకుండా కాపాడింది అతడే.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
జోఫ్రా ఆర్చర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపడం, అతడి కోటా ఓవర్లను ముందుగానే పూర్తి చేయించడం వంటి రిస్కీ నిర్ణయాలే తమను గెలిపించాయని ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag ) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 25, 2026 / 07:21 AM IST
Riyan Parag comments after Rajasthan Royals qualify ipl 2026 playoffs (pic credit@ipl)
- ముంబై పై విజయం
- ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాజస్థాన్ రాయల్స్
- రియాన్ పరాగ్ కామెంట్స్ వైరల్
Riyan Parag : ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో ఆఖరి బెర్తును రాజస్థాన్ రాయల్స్ ఖాయం చేసుకుంది. ఆదివారం వాంఖడే వేదికగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ గెలుపొంది ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ 30 పరుగుల తేడాతో గెలుపొందింది. జోఫ్రా ఆర్చర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపడం, అతడి కోటా ఓవర్లను ముందుగానే పూర్తి చేయించడం వంటి రిస్కీ నిర్ణయాలే తమను గెలిపించాయని ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్ (26 బంతుల్లో 38 పరుగులు), జోఫ్రా ఆర్చర్ (15 బంతుల్లో 32 పరుగులు), దాసున్ శనక (15 బంతుల్లో 29 పరుగులు ) రాణించారు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. విల్ జాక్స్, ఘజన్‌ఫర్, కార్బిన్ బాష్ లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం 206 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 60 పరుగులు) హాఫ్ సెంచరీ చేశాడు. విల్ జాక్స్ (18 బంతుల్లో 33 పరుగులు), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 34 పరుగులు) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీశాడు. నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యష్ రాజ్ పుంజాలు తలా రెండు వికెట్లు పడగొట్టాడు.
అందుకనే జోఫ్రా ఆర్చర్‌ను ముందు పంపాం..
ఈ విజయంతో రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీనిపై రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. సహజంగానే.. అనుకున్నది అనుకున్నట్లు జరిగినప్పుడు అంతా బాగుంటుంది. మేము మ్యాచ్ గెలిచామని, క్వాలిఫై అయ్యామని నాకు తెలుసు, కానీ మేము ఎప్పుడో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాల్సింది. అనవసర తప్పిదాలతో ఆలస్యం చేశాం అని అన్నాడు.
తాము మెరుగుపడాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. క్రీజులో కుదురుకున్న బ్యాటర్ ఇన్నింగ్స్ చివరి వరకు ఆడాలని అనుకున్నాం. అందుకనే దూకుడుగా ఆడే బ్యాటర్ అవసరం కావడంతో జోఫ్రా ఆర్చర్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాం. ఇది వర్కౌట్ అయింది. ఇలాంటి పిచ్‌పై ఇద్దరు బ్యాటర్లు క్రీజులో ఉండి బంతికో సింగిల్ తీస్తే కుదరని చెప్పాడు. అందుకనే ఒకరు రిస్క్ తీసుకుని ఆడేలా చేయాలని, దీంతో కుదురుకున్న బ్యాటర్ ఇంకాసేపు ఎక్కువగా ఆడే అవకాశం ఉంటుందన్నాడు. రిస్క్ తీసుకునే బాధ్యతను జోఫ్రా ఆర్చర్‌కు అప్పగించామని, అతడు దానిని చక్కగా నిర్వర్తించాడని తెలిపాడు.
ఇక జడేజా ఎంతో నమ్మకమైన బ్యాటర్ అని, ఆఖరి ఓవర్లలో 10 బంతుల్లో 20 పరుగులు చేయగలడని తమకు తెలుసునని ఈ మ్యాచ్‌లోనూ అతడు అదే పని చేశాడని చెప్పాడు. ఈ సీజన్‌లో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలిపాడు. తన కెప్టెన్సీ శైలే అలా ఉంటుందన్నాడు.
ఇక ముంబై జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాను ఔట్ చేయగల ఏకైక ఆటగాడు జోఫ్రా ఆర్చర్ మాత్రమే అని తాను భావించానని, ఆ వ్యూహం బాగా పని చేసిందన్నాడు. యువ బౌలర్లు బ్రిజేష్ శర్మ, యష్ రాజ్ పుంజా చాలా బాగా బంతులు వేశారన్నాడు.
ఇక వాస్తవం చెప్పాలంటే తాను ఫిట్‌గా లేనని తెలిపాడు. మానసిక ధృడత్వంతోనే తాను ఈ మ్యాచ్ ఆడానని అన్నాడు. ప్లేఆఫ్స్‌లో కూడా ఆడతాడని స్పష్టం చేశాడు. జోఫ్రా ఆర్చర్‌కు ఏం కాలేదని, అతడు బండరాయిలా ఉన్నాడన్నాడు. జడ్డూకి చిన్న చిన్న నొప్పులు ఉన్నాయన్నాడు. అతడు ఒక యోధుడు అని బలంగా తిరిగి వస్తాడని చెప్పాడు. తప్పులను సరిదిద్దుకుని ప్లేఆఫ్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తామని రియాన్ పరాగ్ తెలిపాడు.
