Riyan Parag : రియాన్ ప‌రాగ్‌కు ఏమైంది? ఆస్ప‌త్రి బెడ్‌పై.. స‌ర్జ‌రీ..

టీమ్ఇండియా క్రికెట‌ర్‌, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూరైంది.

Riyan Parag shares crucial update after shoulder surgery

  • గ‌త రెండేళ్లుగా భుజం గాయంతో బాధ‌ప‌డుతున్న రియాన్ ప‌రాగ్‌
  • ఎట్ట‌కేల‌కు శ‌స్త్ర చికిత్స చేయించుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్‌

Riyan Parag : టీమ్ఇండియా క్రికెట‌ర్‌, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూరైంది. గత రెండేళ్లుగా తీవ్రంగా వేధిస్తున్న భుజం గాయానికి ఎట్టకేలకు సర్జరీ చేయించుకున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌రాగ్ వెల్ల‌డించాడు. అంతేకాదండోయ్ ఆస్ప‌త్రి బెడ్ పై ఉన్న ఫోటోను పంచుకున్నాడు.

2024లో టీమ్ఇండియాలో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఈ సమస్య పరాగ్‌ను వెంటాడుతోంది. అయిన‌ప్ప‌టికి కూడా నొప్పిని భ‌రిస్తూనే జ‌ట్టుకు అందుబాటులో ఉండేందుకు ప్ర‌య‌త్నించాడు. గ‌త రెండేళ్లుగా ఈ గాయం త‌న కెరీర్‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌న్నాడు. కొన్ని రోజులు సంతోష‌క‌రంగా గ‌డిచినా, మ‌రికొన్ని రోజులు తీవ్ర నిరాశ‌ను ఎదుర్కొన్న‌ట్లు చెప్పుకొచ్చాడు. కొన్ని సార్లు అయితే.. పూర్తి మ్యాచ్ ఆడ‌డ‌మే పెద్ద స‌వాల్‌గా మారింద‌న్నాడు. ఆ క‌ష్టాలు అన్ని కూడా త‌న‌ను మ‌రింత ధృడంగా మార్చాయ‌న్నాడు.


చివరకు నా భుజమే గెలిచింది. అందరూ అడుగుతున్నందుకు చెబుతున్నాను.. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. గత రెండేళ్లు నేను ఊహించని విధంగా నన్ను ప‌రీక్షించింది. మంచి రోజులు, నిరాశపరిచిన రోజులు, ఆట పూర్తి చేయడమే కష్టమైన రోజులు కూడా చూశాను. అని ప‌రాగ్ అన్నాడు. ఇకపై తనకు కోలుకోవడం (రికవరీ), పునరావాసం (రీహాబ్), ఓపిక పట్టడం అనే కొత్త సవాళ్లు ఉన్నాయని, త్వరలోనే మరింత బలంగా మైదానంలోకి అడుగుపెడతానని ధీమాను ప‌రాగ్ వ్య‌క్తం చేశాడు.

ఈ విష‌యం తెలిసిన అభిమానులు అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 సీజన్‌లో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టును అద్భుతంగా న‌డిపించాడు. తొలిసారి కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అత‌డు మొద‌టి ప్ర‌య‌త్నంలోనే జ‌ట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకువెళ్లాడు. క్వాలిఫ‌య‌ర్-2లో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ ఓట‌మి పాలై తృటిలో ఫైన‌ల్ చేరుకునే అవ‌కాశాన్ని కోల్పోయింది.