Rohit Sharma : ధోని రికార్డును స‌మం చేసిన రోహిత్.. ఇంకొక్క మ్యాచ్ చాలు..!

ఇండోర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో భార‌త్ విజ‌యం సాధించింది.

Rohit Sharma Equals MS Dhoni Record

Rohit Sharma Equals MS Dhoni Record : ఇండోర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో భార‌త్ విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని రికార్డును స‌మం చేశాడు. టీ20ల్లో టీమ్ఇండియాకు 41 మ్యాచుల్లో ధోని విజ‌యాలు అందించ‌గా అఫ్గాన్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త్ గెల‌వ‌డంతో సార‌థిగా హిట్‌మ్యాన్ కూడా అన్నే మ్యాచుల్లో విజ‌యాలు అందుకున్నాడు.

ధోని త‌న కెరీర్‌లో 72 టీ20 మ్యాచుల‌కు నాయ‌క‌త్వం వ‌హించగా రోహిత్ కేవ‌లం 53 మ్యాచుల్లోనే మ‌హేంద్రుడి రికార్డును స‌మం చేయ‌డం విశేషం. అఫ్గాన్‌తో జ‌ర‌గ‌నున్న మూడో టీ20 మ్యాచులో భార‌త్ విజ‌యం సాధిస్తే టీమ్ఇండియాకు అత్య‌ధిక విజ‌యాలు అందించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు. కోహ్లి నేతృత్వంలో భార‌త్‌ 50 టీ20 మ్యాచ్‌లు ఆడ‌గా 30 మ్యాచుల్లో గెలిచింది. అలాగే హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వంలో 16 మ్యాచ్‌లు ఆడ‌గా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Also Read: కెప్టెన్సీపై యువీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. హార్దిక్ అవ‌స‌రం ఉందంటూనే..

దుబాయ్ వేదిక‌గా 2021లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ ప‌గ్గాలు వ‌దిలేయ‌డంతో రోహిత్ శ‌ర్మ సార‌థ్య బాధ్య‌త‌లు అందుకున్నాడు. టీమ్ఇండియాను విజ‌యాల బాట‌లో న‌డిపిస్తున్నాడు. 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌ను సెమీస్‌కు చేర్చాడు.

అఫ్గాన్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్యాన్ని భార‌త్ 15.4 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63) లు మెరుపు అర్ధ‌శ‌త‌కాలు బాదారు.

Also Read: టీ20ల్లో రిజ్వాన్ అరుదైన రికార్డు.. సిక్స‌ర్ల మోత‌..

ట్రెండింగ్ వార్తలు