Rohit Sharma : అతడి కోసం ఇన్నింగ్స్ డిక్లేర్ ఆలస్యం.. ఇంతకీ ఎవరా ప్లేయర్ అంటే..?
మొదటి టెస్టులో వెస్టిండీస్ పై ఘన విజయంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 సైకిల్‌ను ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 15, 2023 / 04:39 PM IST
Rohit Sharma
Rohit Sharma-Ishan Kishan : మొదటి టెస్టులో వెస్టిండీస్ పై ఘన విజయంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 సైకిల్‌ను ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ (171), రోహిత్ శర్మ(103), విరాట్ కోహ్లి(76)లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా.. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్(12/131) ధాటికి విండీస్ కుప్పకూలింది. భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
IND Vs WI: ఇషాంత్ కిషన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో ఇదిగో
వాస్తవానికి విరాట్ కోహ్లి ఔట్ కాగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. అయితే.. ఓ ఆటగాడి కోసం తన నిర్ణయాన్ని ఆలస్యం చేసినట్లు తెలిపాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు ఈ మ్యాచ్‌లోనే టెస్టుల్లో అరంగ్రేటం చేసిన ఇషాన్ కిషన్. తొలి మ్యాచ్ కావడంతో అతడు ఖాతా తెరిచిన తరువాత డిక్లేర్ చేయాలని బావించినట్లు రోహిత్ తెలిపాడు. బ్యాటింగ్ చేసేందుకు ఇషాన్ కిషన్ ఎక్కువ ఉత్సాహంగా ఉండడాన్ని గమనించాను. అందుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. కాగా.. ఇషాన్ కిషన్ తొలి పరుగు చేసేందుకు 20 బంతులు ఎదుర్కోవడం గమనార్హం.
ఇక మరో యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిలో చాలా టాలెంట్ ఉందని కొనియాడాడు. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడని, రాగానే చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అతడిలో ఎక్కడా కంగారు కనిపించలేదని, అలా ఆడడం చాలా గొప్ప విషయం అని అన్నాడు. టీ20ల్లో ప్రదర్శించిన దూకుడును నియంత్రించుకుంటూ పరుగులు సాధించాడన్నారు. ఆటను మరింత ఆస్వాదించి ఆడితే పరుగులు అవే వస్తాయని మాత్రమే తాను అతడికి చెప్పినట్లు రోహిత్ తెలిపాడు.
