సొంతగడ్డపై జరిగిన హోరాహోరీ సమరంలో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 199 పరుగుల లక్ష్య చేధనకు దిగిన హైదరాబాద్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు నష్టపోయి టార్గెట్ ను చేధించింది. దీంతో లీగ్ లో హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసుకున్నట్లు అయింది.
ఆరంభంలో దూకుడుగా ఆడిన సన్ రైజర్స్ ఒకానొక దశలో వరుస వికెట్లు చేజార్చుకుంది. ఆ స్థితిలో ఆల్ రౌండర్ రషీద్ ఖాన్(15)పరుగులతో మ్యాచ్ కు మంచి ముగింపునిచ్చాడు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(69; 37 బంతుల్లో), జానీ బెయిర్ స్టో(45; 28 బంతుల్లో) చక్కటి ఆరంభాన్నిచ్చారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(10)పరుగులతోనే సరిపెట్టుకోగా, ఆల్ రౌండర్ విజయ్ శంకర్(35; 15 బంతుల్లో) స్కోరు బోర్డును పరుగులుపెట్టించాడు. మనీశ్ పాండే(1), యూసుఫ్ పఠాన్(16)లతో సరిపెట్టుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టపోయి సన్‌రైజర్స్‌కు 199 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఓపెనర్‌గా దిగిన అజింకా రహానె(70; 49బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు)తో శుభారంభాన్ని అందించాడు. మూడో వికెట్‌గా బరిలోకి దిగిన శాంజూ శాంసన్ సెంచరీకి మించిన స్కోరుతో అదరగొట్టాడు.
55 బంతుల్లో చెలరేగి (102)పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న బెన్ స్టోక్స్(16)చక్కని భాగస్వామ్యాన్ని అందించాడు. రషీద్ ఖాన్, షెహబాయ్ నదీమ్ చెరో వికెట్ తీయగలిగారు.