Rishabh Pant : రిషబ్ పంత్ జీతంలో భారీ కోత.. ఏకంగా రూ.12 కోట్లు! మళ్లీ పాత గూటికే వికెట్ కీపర్!
రిషబ్ పంత్ (Rishabh Pant) తన వేతనంలో భారీ కోతకు సిద్ధపడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 20, 2026 / 07:44 AM IST
Rs 12 Crore Pay Cut For Rishabh Pant Report
- లక్నోను వీడనున్న పంత్
- మళ్లీ పాత ఫ్రాంఛైజీకి
- వేతనంలో భారీ కోతకు అంగీకారం
Rishabh Pant : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు రిషభ్ పంత్. 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో అత్యధిక ధర సొంతం చేసుకున్న ఆటగాడిగా ఉన్న రిషబ్ పంత్ లక్నో ఫ్రాంఛైజీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదండోయ్ అతడు తన వేతనంలో భారీ కోతకు అంగీకరించనున్నట్లు సమాచారం.
అత్యధిక ధరకు కొనుగోలు చేసిన లక్నో.. పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అయితే.. తన జట్టును నడిపించడంలో పంత్ దారుణంగా విఫలం అయ్యాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో లక్నో ఏడో స్థానంలో నిలవగా.. 2026 ఐపీఎల్ సీజన్‌లో అయితే ఆఖరి స్థానంలో నిలిచింది.
Scotland fans : ఫిఫా ప్రపంచకప్ తెచ్చిన తంటా.. బీర్లు నో స్టాక్.. 10 వేల మంది కలిసి..
తాజా నివేదికల ప్రకారం పంత్ లక్నోను వీడి తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ కథనం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆటగాళ్ల మార్పిడి ఒప్పందం (ట్రేడ్ డీల్) దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌లో రిషభ్ పంత్ ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులో చేరనున్నాడు. దీంతో పంత్.. గతంలో తొమ్మిది సీజన్లు ఆడిన ఢిల్లీకి మళ్లీ ఆడనుండగా, కుల్దీప్ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కనుంది.
ఈ ఒప్పందంలో అత్యంత ఆసక్తికర అంశం ఏంటంటే.. పంత్ వేతనంలో భారీ కోత. రూ.27 కోట్లతో పంత్‌ను తీసుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు సాధ్యం కాదు. తన జీతంలో సగం కంటే కాస్త ఎక్కువగా.. అంటే సుమారు రూ.15 కోట్ల పారితోషికానికి అతడు అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం పొందుతున్న రూ.13.25 కోట్ల వేతనంతోనే లక్నో జట్టులో చేరనున్నాడు. అతడి జీతంలో ఎలాంటి మార్పు ఉండదని నివేదిక పేర్కొంది.
కోచ్‌గా యువీ..
ఇదిలా ఉండగా.. భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ 2027 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2027-28 సీజన్‌లకు జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యాన్ని చేపట్టనున్నందున ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ సిబ్బందిలో సమూల మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. సహ యజమానులైన జీఎంఆర్ నియమించిన వేణుగోపాల్ రావు , హేమాంగ్ బదానీ , మునాఫ్ పటేల్‌లతో కూడిన త్రయం స్థానంలో కొత్త సహాయక సిబ్బంది రానున్నారు.
