Shai Hope : రెండో టీ20 మ్యాచ్‌లో విజ‌యం.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కామెంట్స్ వైర‌ల్‌.. నిజం చెప్పాలంటే..

భార‌త్ పై రెండో టీ20 మ్యాచ్‌లో విజ‌యం సాధించిన త‌రువాత వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ (Shai Hope) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Shai Hope comments after West Indies beat Team India in 2nd T20

Shai Hope : రాంచి వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ప్ర‌స్తుతానికి 1-1తో స‌మం చేసింది. రెండో టీ20 మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం పట్ల వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

సంజూ శాంస‌న్ (82; 41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా.. ఇషాన్ కిష‌న్ (43; 22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (40; 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), తిల‌క్ వ‌ర్మ (44 నాటౌట్; 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)లు వేగంగా ఆడ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 249 ప‌రుగులు చేసింది. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో రోస్ట‌న్ ఛేజ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. షమర్ స్ప్రింగర్ రెండు వికెట్లు తీశాడు.

అనంత‌రం 250 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని వెస్టిండీస్ 18.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో షై హోప్ (102 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (84; 37 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర హాఫ్ సెంచ‌రీ చేయ‌గా.. రొమారియో షెపర్డ్ (34 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించాడు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్‌ మూడు వికెట్లు తీయ‌గా.. కుల్దీప్ యాద‌వ్ ఓ వికెట్ సాధించాడు.

5/2 ఉన్న‌ప్పుడు క‌ష్ట‌మ‌వుతుంద‌ని అనుకున్నా..

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు విజ‌యం పై షై హోప్ స్పందించాడు. ‘ఈ భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డం క‌ష్టమ‌వుతుంద‌ని అనుకున్నాను. అయితే.. భారతదేశంలో ఆడుతున్నప్పుడు, ఎప్పుడూ గెలుపుకు ఒక అవకాశం ఉంటుందని నమ్ముతాం. స్కోరు బోర్డుపై ఎంత స్కోరు ఉన్నా సరే.. మనం ఇంకా ఆటలో ఉన్నామని భావిస్తాం. అయినప్పటికీ.. 5 పరుగులకు 2 వికెట్లు కోల్పోవడం అనేది కచ్చితంగా సవాలుతో కూడిన పరిస్థితే. ఈ ద‌శ‌లో రోవ్‌మన్, నేను కలిసి భాగస్వామ్యం నెలకొల్పినప్పుడు మా ఇన్నింగ్స్‌కు మంచి ఊపు వచ్చింది. ఆ తర్వాత షెర్ఫేన్ వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ రోజు విజయం సాధించడానికి మాకు అవసరమైన ఆ ‘స్పార్క్’ ను అతనే అందించాడు.

ఇక భాగస్వామ్యాల్లో మనం ఇంకా బాగా బ్యాటింగ్ చేయాలని నేను బలంగా నమ్ముతాను. కొన్నిసార్లు మనలో ఆ సామర్థ్యం లోపిస్తుంటుంది. కానీ మీరు చెప్పినట్లుగా.. కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గి మీ భాగస్వామి షాట్లు ఆడటాన్ని గమనించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిలో ఆట వేగానికి అనుగుణంగా స్కోరు సాధిస్తున్నంత సేపు నేను అనవసరమైన రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. మేము చాలా బాగా ఆడుతున్నామని భావించాను.

Shreyas Iyer : ఆ ఒక్క కార‌ణం వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు..

రోస్టన్ చేస్ బౌలింగ్ అద్భుతం. ఇలాంటి పిచ్, మైదానంలో ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున మాత్రమే ఇవ్వడం నమ్మశక్యం కాని విషయం. అతను నిజంగానే మమ్మల్ని మ్యాచ్‌లో నిలబెట్టాడు. బౌలింగ్ చేయడానికి పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయని నాకు తెలుసు. కాబట్టి అతను బౌలింగ్ చేసిన తీరు మమ్మల్ని పోటీలో ఉంచిన విధానం, ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మాకు చాలా సహాయపడింది.

ఈ పిచ్ పై బంతి చాలా వేగంగా దూసుకెళ్తున్నట్లు అనిపించింది. బౌండరీలు కొంచెం పెద్దవిగా ఉన్నప్పటికీ, మన సామర్థ్యంపై మనకు నమ్మకం ఉండాలి. ఇంతకు ముందు చెప్పినట్లుగా అదృష్టం కూడా తోడుండాలి, ఈ రోజు నాకు అలాంటి రోజే. ప‌రుగులు చేస్తున్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. ప్రస్తుతం నా ఫామ్ బాగుందని చెప్పవచ్చు, కానీ నేను సిద్ధమయ్యే విధానం, మానసికంగా, ఉల్లాసంగా ఉండేలా చూసుకునే తీరు నాకు మంచి ప్రదర్శన చేసే అవకాశాన్ని ఇస్తున్నాయని భావిస్తున్నాను. ఇది సాధ్యమైనంత కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. దీన్ని త‌ల‌కు ఎక్కించుకోను.’ అని షై హోప్ తెలిపాడు.