Shai Hope : ధోని సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీలక కామెంట్స్..
మూడో వన్డేలో భారత్ పై విజయం సాధించిన తరువాత వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ (Shai Hope ) కీలక వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- October 4, 2026 / 08:52 AM IST
Shai Hope key comments after West Indies beat India in 3rd ODI
Shai Hope : న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ పై వెస్టిండీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ షై హోప్ కీలక పాత్ర పోషించాడు. 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 162 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని ఇచ్చిన ఓ సలహా కారణంగా తాము ఈ మ్యాచ్‌లో విజయం సాధించినట్లు షై హోప్ చెప్పాడు.
ఆఖరి వన్డేలో గెలిచినప్పటికి కూడా తొలి రెండు వన్డేల్లో ఓడిపోవడంతో వెస్టిండీస్ సిరీస్‌ను భారత్‌కు కోల్పోయింది. ఇక మూడో వన్డే అనంతరం విండీస్ కెప్టెన్ షై హోప్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించాడు. భారతదేశంలో పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయన్నాడు. ముఖ్యంగా మంచు కురిసే సమయంలో బ్యాటింగ్ చేయడం చాలా సులభంగా ఉంటుందన్నాడు. తొలి రెండు వన్డేల్లో ఓడిపోయినప్పటికి కూడా సిరీస్‌ను ఘనంగా ముగించాలని భావించామని, అలా చేసినందుకు సంతోషంగా ఉందన్నాడు.
ఇక బ్యాటింగ్ చేసే క్రమంలో పరుగు తీసేందుకు షై హోప్ ఇబ్బంది పడ్డాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. 30 ఓవర్ల తరువాత తనకు గజ్జల ప్రాంతంలో ఏదో అసౌకర్యంగా కలిగినట్లు అనిపించిందన్నాడు. అయినప్పటికి చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రచించిన ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. తమ జట్టులో ఒకరు కాదు ఇద్దరు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. దీంతో ఇద్దరు బ్యాటర్లు తక్కువ అయ్యారని చెప్పాడు. ఇలాంటి సందర్భాల్లో భారీ లక్ష్యాలను ఛేదించడం సవాల్‌తో కూడుకున్న విషయం అని చెప్పాడు.
ధోని సలహాతోనే ..
అయితే.. గతంలో టీమ్ఇండియా ఆటగాడు ఎంఎస్ ధోనితో మాట్లాడడం ఇప్పుడు ఉపయోగపడిందన్నాడు. ‘మనం అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం ఎప్పుడూ ఉంటుందని ఆయన నాకు చెప్పారు. అందుకే మ్యాచ్ తుది ఫలితంపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా.. ప్రక్రియపై దృష్టి సారించాను. ఆటను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని.. చివరలో బౌండరీలు సాధించడానికి మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నించాను. భారత జట్టు ఓవర్ల విషయంలో వెనుకబడి ఉండటాన్ని కూడా నేను గమనించాను. కాబట్టి.. చివరి దశలో వారు తప్పనిసరిగా కొందరు ఫీల్డర్లను సర్కిల్ లోపలికి తీసుకురావాల్సి ఉంటుందని నాకు తెలుసు. స్కోరును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఐదుగురు ఫీల్డర్లను సర్కిల్ లోపల ఉంచాల్సి రావడం ఎప్పుడూ కష్టమైన విషయమే. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాటన్నింటినీ నేను అంచనా వేసుకున్నాను. అదృష్టవశాత్తూ.. చివరి దశలో అన్నీ మాకు అనుకూలంగా జరిగాయి. ‘అని హోప్ తెలిపాడు.
మీ నైపుణ్యాలను ప్రదర్శించాల్సిందే..
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తాము అక్కడక్కడా చాలా చక్కని క్రికెట్ ఆడామని హోప్ చెప్పుకొచ్చాడు. ‘బ్యాటర్లు పరుగులు సాధిస్తున్నారు.. మేము కూడా అదే కోరుకున్నాము. గత రెండు, మూడు ఏళ్లుగా బ్యాటర్లు నిలకడగా రాణిస్తూ మంచి ప్రదర్శన చేస్తున్నారు. భారీ స్కోర్లు సాధించాలని మేము వారికి సూచించాము. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే. భారత్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని మాకు తెలుసు.. అక్కడ మీ నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. పొరపాట్లకు చాలా తక్కువ ఆస్కారం మాత్రమే ఉంటుంది. కాబట్టి.. బౌలింగ్ పరంగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. మా ఆటగాళ్లు ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, భవిష్యత్తులో బౌలింగ్‌లో మరింత మెరుగ్గా రాణిస్తామని నేను నమ్ముతున్నాను. ఇక టీ20 సిరీస్‌కు సన్నద్ధం అయ్యేందుకు రెండు రోజుల సమయమే ఉంది.’ అని హోప్ చెప్పాడు.
