Shreyas Iyer : ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ఆ ఒక్క ఓవరే మా కొంపముంచింది
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఓటమిపై టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer ) స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 5, 2026 / 07:59 AM IST
Shreyas Iyer comments after India lost 2nd T20 match against england
- రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి
- స్పందించిన టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
- ఆ ఒక్క ఓవరే తమ కొంపముంచిందని వ్యాఖ్య..
Shreyas Iyer : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై భారత్ ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవరే తమ ఓటమిని శాసించిందని భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
ఇషాన్ కిషన్ (49; 40 బంతుల్లో 6 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (37; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (24 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు)లు రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం జాకబ్ బెథెల్ (76 నాటౌట్; 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (39; 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), టామ్ బాంటన్ (39; 32 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాధించారు.
కాగా.. రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ ఓవర్‌లో బిష్ణోయ్ రెండు నోబాల్స్ వేయడంతో పాటు మొత్తంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గింది.
వైభవ్‌కు అండగా ఉంటా..
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఎక్కడ తప్పు జరిగిందో అందరికి తెలుసునని అన్నాడు. అయినప్పటికి కూడా తాను ఏ ఒక్క ఆటగాడిని వేలెత్తి చూపించాలని అనుకోవడం లేదన్నాడు. 15వ ఓవర్ వరకు మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందన్నాడు. తొలి నోబాల్ తరువాత.. బిష్ణోయ్ పుంజుకుంటాడని భావించానని కానీ.. 17వ ఓవర్‌తో మ్యాచ్ తమ నుంచి చేజారిపోయిందన్నాడు.
ఏది ఏమైనప్పటికి ఈ తప్పుల నుంచి అతడు నేర్చుకుంటాడని భావిస్తున్నట్లు తెలిపాడు. అస్థిరమైన బౌన్స్ ఉన్న ఈ పిచ్ పై తాము సాధించిన స్కోరు సరిపోతుందని భావించినట్లు చెప్పాడు. తొలి 15 ఓవర్లు మాదే పై చేయిగా ఉందని, అయితే.. ఆకస్మాత్తుగా పరిస్థితి మారిపోయిందన్నాడు. జాకబ్ బెథెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. మైదానం కొలతలు, పిచ్ స్వభావాన్ని ఇంగ్లాండ్ ప్లేయర్లు చాలా త్వరగానే అంచనా వేశారని తెలిపాడు. సామ్‌కరన్ ఎంతో తెలివిగా ఆఫ్ స్టంప్‌కు బయట బౌలింగ్ చేశాడన్నాడు.
ఇక అరంగ్రేటం చేసిన వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. అతడు ఫియర్‌లెస్ క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. అతడు నెట్స్‌లో బ్యాటింగ్ చేసే విధానం అద్భుతం అని అన్నాడు. ఆ నిర్భయమైన క్రికెట్ శైలి నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నాడు. నిజం చెప్పాలంటే.. అతడు దేనికి కంగారు పడడని అన్నాడు. గత కొన్ని నెలలు, సంవత్సరాలుగా అతను అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడని తెలిపాడు. ఓ వ్యక్తిగా అతని సామర్థ్యం ఏమిటో మనందరికీ తెలుసునని అన్నాడు. అందుకే తాను ఖచ్చితంగా అతనికి అండగా నిలిచానని అన్నాడు.
ఇక ఫలితాలతో సంబంధం లేకుండా తాను ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటానని అన్నాడు. ఇది అత్యంత క్లిష్టమైన దశ అని తనకు తెలుసునని, కాబట్టి ఇకపై గెలుపు దిశగా సాగడమే ఏకైక మార్గం అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
