Shreyas Iyer : ఆ ఒక్క తప్పు వల్లనే మేం ఓడిపోయాం.. లేదంటేనా.. శ్రేయస్ అయ్యర్ కామెంట్స్..
ఐదో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంపై టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Published on- November 1, 2026 / 04:53 PM IST
Shreyas Iyer comments after India lost Match to New Zealand in 5th t20
Shreyas Iyer : హామిల్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగానే ఈ మ్యాచ్‌లో ఓటమి పాలు అయ్యామని టీమ్ఇండియా టీ20 కెప్టెన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికి కూడా సిరీస్ గెలవడంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (61; 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50; 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే నాలుగు వికెట్లు తీయగా.. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Glenn Phillips : చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్.. ఏకైక న్యూజిలాండ్ ప్లేయర్..
అనంతరం 192 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (93; 50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (65 నాటౌట్; 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలు చేశారు. డారిల్ మిచెల్ (29; 16 బంతుల్లో 4 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఓ వికెట్ పడగొట్టారు.
బ్యాటర్లపై ఒత్తిడి, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలం..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. నిజం చెప్పాలంటే, మా ప్రదర్శన ఫర్వాలేదనిపించింది. మిడిల్ ఓవర్లలో ఇషాన్, నేను కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు ఊపునిచ్చాం. ఆ సమయంలో వచ్చిన ఆరంభాన్ని దృష్టిలో పెట్టుకుంటే మేము మరింత మెరుగ్గా ఆడాల్సింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయాం. దీంతో క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్లపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది..
ముఖ్యంగా బంతి స్వింగ్ అవుతూ.. పిచ్‌పై కొంత ఆగి రావడంతో బ్యాటింగ్ చేయడం అంత సులభంగా లేదు. కొన్ని సందర్భాల్లో బంతి వేగంగా కూడా దూసుకొచ్చింది. నేను, తిలక్ కూడా దాదాపు ఒకే తరహాలో వికెట్లు కోల్పోయిన విషయం మీరు గమనించే ఉంటారు. ముఖ్యంగా హార్డ్ లెంగ్త్ బంతులను ఎదుర్కోవడం చాలా సవాలుగా మారింది. అయినప్పటికీ 194 పరుగులు చేయడం మంచి స్కోరేనని భావిస్తున్నాను.
అయితే బౌలింగ్, ఫీల్డింగ్‌లో మేము ఇంకా మెరుగ్గా రాణించాల్సింది. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేశాం. కానీ ఈ మ్యాచ్ ద్వారా మంచి పాఠాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా న్యూజిలాండ్ వంటి విదేశీ గడ్డపై పర్యటిస్తూ, విభిన్న పరిస్థితులు, వేర్వేరు మైదానాల్లో ఆడటం మాకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.
ఇక సిరీస్ విజయం పై మాట్లాడుతూ.. తొలి మూడు మ్యాచ్‌లు మా జట్టుకు మంచి లయను అందించాయి. ఆ తర్వాత చివరి రెండు మ్యాచ్‌ల్లో మమ్మల్ని మేము మరింత పరీక్షించుకోవాలని, కొన్ని ప్రయోగాలు చేయాలని భావించాం. ఈరోజు మ్యాచ్ అందుకు సరైన అవకాశంగా భావించాం. అయితే అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం. అయినప్పటికీ ఇది మాకు మంచి అనుభవం, ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి దాని గురించి ఎక్కువగా ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే మేము వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంతో ఉన్నారు.
విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆటలో వివిధ అంశాల్లో సవాళ్లు ఎదురవుతాయి. ఆ సవాళ్లను ధైర్యంగా స్వీకరించి ముందుకు సాగితేనే మరింత మెరుగవుతాం. ఈరోజు మ్యాచ్‌లో కూడా అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
