Shreyas Iyer : ఆ ఒక్క కార‌ణం వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు..

రెండో టీ20 మ్యాచ్‌లో ఓడిపోవ‌డం పై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) స్పందించాడు.

Shreyas Iyer comments after India lost match to West Indies in 2nd T20

Shreyas Iyer : రాంచి వేదిక‌గా శుక్ర‌వారం వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మంచు ప్ర‌భావంతో పాటు విండీస్ బ్యాట‌ర్లు షై హోప్, రూథర్‌ఫోర్డ్ ల అద్భుత బ్యాటింగే త‌మ కొంప‌ముంచింద‌ని టీమ్ఇండియా టీ20కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 249 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో సంజూ శాంస‌న్ (82; 41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం బాదాడు. ఇషాన్ కిష‌న్ (43; 22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (40; 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), తిల‌క్ వ‌ర్మ (44 నాటౌట్; 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)లు రాణించారు. విండీస్ బౌల‌ర్ల‌లో రోస్ట‌న్ ఛేజ్ మూడు వికెట్లు తీశాడు. షమర్ స్ప్రింగర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం షై హోప్ (102 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో 250 ప‌రుగుల ల‌క్ష్యాన్ని వెస్టిండీస్‌ 18.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (84 ; 37 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. రొమారియో షెపర్డ్ (34 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) వేగంగా ఆడారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్‌ మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాద‌వ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఎంతైనా క‌ష్ట‌మే..

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. నిజం చెప్పాలంటే మంచు ప్ర‌భావం ఉన్న‌ప్పుడు ఎంత స్కోరు సుర‌క్షితం అనే విష‌యం చెప్పలేమ‌న్నాడు. మంచు కురిస్తే ఎంత పెద్ద ల‌క్ష్యాన్ని అయినా కాపాడుకోవ‌డం క‌ష్ట‌మవుతుంద‌న్నాడు. 249 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కూడా విండీస్ మ‌రో రెండు ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే ఛేజ్ చేశారు. కాబట్టి.. ఇంత స్కోరు చేయాలని ముందే ఒక సంఖ్యను నిర్ణయించుకోవడం లేదా అంచనా వేయడం సాధ్యం కాదన్నాడు.

‘ఇక ఈ పిచ్ పై బౌల‌ర్లు పొర‌పాటు చేసే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఎందుకంటే వారు లైన్ అండ్ లెంగ్త్ ఏ కొద్దిగా మిస్ అయినా కూడా బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లిపోతుంది. ఇక విండీస్ బ్యాట‌ర్లు కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక మేము కూడా కొన్ని అవకాశాలు చేజార్చుకున్నాము. కానీ అవన్నీ ఆటలో సహజమే. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా వాళ్లు చాలా బాగా బ్యాటింగ్ చేశారు.

ఇక సంజూ శాంస‌న్‌, మ‌యాంక్ యాద‌వ్‌లు వారి వారి విభాగాల్లో అద్భుతంగా రాణించారు. ఇక అభిషేక్ కూడా బాగా ఆడాడు. ముఖ్యంగా సంజూ, అభిషేక్ నుంచి మేం ఆశించేది ఇదే. బాధ్య‌త తీసుకుంటూ నిల‌క‌డ‌గా రాణిస్తూ మంచి ర‌న్‌రేట్‌ను అందిస్తే ఆడ‌డం బాగుంది. మయాంక్ చాలా మంచి ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. మ‌యాంక్ తీసిన ఆ మూడు కీల‌క వికెట్లు మ‌మ్మ‌ల్ని మంచి స్థితిలో ఉంచాయి. అయితే.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బ్యాట‌ర్లు కీల‌క భాగ‌స్వామ్యాల‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు.’ అని శ్రేయ‌స్ అయ్య‌ర్ అన్నాడు.