Shreyas Iyer : తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమికి శ్రేయస్ అయ్యర్ చెప్పిన సాకులు ఇవే..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 27, 2026 / 10:09 AM IST
Shreyas Iyer comments after Team India lost 1st T20 match to Ireland
- తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో ఓటమి
- స్పందించిన టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన మొదటి మ్యాచ్‌లో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో టీమ్ఇండియా 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. మిడిల్ ఓవర్లలో ప్రణాళికలకు తగ్గట్లుగా బౌలింగ్ చేయకపోవడం, 140లోపు ప్రత్యర్థిని కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. గారెత్ డెలానీ (49; 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. శివమ్ దూబె ఓ వికెట్ సాధించాడు.
*Sanju Samson : తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన సంజూ శాంసన్.. ఇప్పుడెలా?
ఆ తరువాత 183 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (49; 20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3), వాషింగ్టన్ సుందర్ (9)లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. తిలక్ వర్మ (19), శివమ్ దూబె (25) పర్వాలేదనిపించారు. ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ హోల్లార్డ్, మాథ్యూ హంఫ్రీస్ లు చెరో మూడు వికెట్లు తీయగా.. జై మూండ్రా రెండు వికెట్లు సాధించాడు. లియామ్ మెక్‌కార్తీ, గారెత్ డెలానీ లు ఒక్కొ వికెట్ పడగొట్టాడు.
అందుకనే ఓడిపోయాం..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ కంటే బౌలర్ల వైఫల్యమే తమ కొంపముంచిందన్నాడు. మ్యాచ్ ప్రారంభంలో బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారన్నాడు. పిచ్ నుంచి మంచి స్వింగ్ లభించడంతో కొన్ని వికెట్లు పడగొట్టడంతో అద్భుతమైన ఆరంభం లభించిందన్నాడు. అయితే.. మిడిల్ ఓవర్లలో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామన్నాడు.
మైదానం చాలా చిన్నది అని తెలిసినప్పటికి కూడా స్ట్రైయిట్ షాట్లు ఆడేలా బంతులు వేశామన్నాడు. ప్రత్యర్థిని 140 పరుగుల లోపు కట్టడి చేసి ఉంటే బాగుండేదన్నాడు. ఫలితం ఎలా ఉన్నప్పటికి కూడా ఇలాంటి వేదికల్లో ఆడడం బాగుందన్నాడు. ఇక్కడి వాతావరణం, పిచ్‌లపై తమకు ఇప్పుడు ఓ స్పష్టమైన అవగాహన వచ్చిందన్నాడు. సుదీర్ఘ విరామం తరువాత ఆడడం కూడా ఓటమికి ఓ కారణం అని చెప్పాడు.
ఇక ఈ మ్యాచ్ ఫలితాన్ని వీలైనంత త్వరగా మరిచిపోయి తదుపరి మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతామన్నాడు. ఈ మ్యాచ్ ఓటమి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నాడు.’ ఏ విషయాన్నీ తేలికగా తీసుకోకూడదు . కేవలం మైదానంలో అడుగుపెట్టినంత మాత్రాన మ్యాచ్‌లు గెలవలేము. కష్టపడి ఆడాలి. ఆటపైనే దృష్టి పెట్టాలి. పరిస్థితులను అంచనా వేయాలి. ప్రత్యర్థి పై ఒత్తిడి పెంచే అవకాశం దొరికితే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తదుపరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాము.’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
