Garry Sobers passes away : క్రికెట్ ప్రపంచంలో విషాదం.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూత
Legendary West Indies cricketer Garry Sobers passes away : వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్ (89) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తనయుడు డేనియల్ వెల్లడించారు.
west indies cricket legend sir garfield sobers passes away
Legendary West Indies cricketer Garry Sobers passes away : వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్ (89) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తనయుడు డేనియల్ వెల్లడించారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గ్యారీ సోబర్స్ గుర్తింపు పొందారు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ మూడు విభాగాల్లోనూ అసాధారణ ప్రతిభ కనబర్చిన సోబర్స్ మృతి క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.
Also Read : FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు డొనాల్డ్ ట్రంప్.. అయ్యో.. అర్జెంటీనాకు కొత్త టెన్షన్..
1936 జులై 28న బార్బడోస్‌లో గ్యారీ సోబర్స్ జన్మించారు. 16ఏళ్ల వయస్సులో బార్బడోస్ తరపున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసి.. ఏడాదిలోనే (1954) వెస్టిండీస్ జాతీయ జట్టు తరపున టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టారు. 1954 నుంచి 1974 వరకు సాగిన ఆయన అంతర్జాతీయ కెరీర్లో 93 టెస్టులు ఆడి 8,032 పరుగులు చేశారు. ఇందులో 26 సెంచరీలు ఉన్నాయి. బౌలర్ గానూ 235 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రతిభ కనబర్చారు. ఎడమచేతి బ్యాటర్, వేగం-స్పిన్ రెండూ వేయగల బౌలర్, అద్భుత ఫీల్డర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
1958లో పాకిస్థాన్‌పై 365 నాటౌట్ చేసి అప్పటి వరకు టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఆ రికార్డు 1994లో బ్రియాన్ లారా 375 పరుగులు చేసే వరకు కొనసాగింది. అలాగే 1968లో ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా కూడా సోబర్స్ చరిత్రలో నిలిచారు.
1965 నుంచి 1972 వరకు వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గ్యారీ సోబర్స్.. 1975లో క్రికెట్‌కు చేసిన సేవలకుగాను బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ II చేతుల మీదుగా ‘నైట్‌హుడ్’ బిరుదును అందుకున్నారు. 1998లో బార్బడోస్ జాతీయ హీరోగా గౌరవించగా, 2009లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఐసీసీ ప్రతి ఏడాది అత్యుత్తమ పురుష క్రికెటర్‌కు అందించే అత్యున్నత పురస్కారానికి “సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ” అని పేరు పెట్టింది.
గ్యారీ సోబర్స్ మృతిపట్ల బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, వెస్టిండీస్ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు దిగ్గజ క్రికెటర్లు సంతాపం తెలిపారు. క్రికెట్ చరిత్రలోనే గొప్ప ఆల్‌రౌండర్‌ను ప్రపంచం కోల్పోయిందంటూ నివాళులర్పించారు.
