IND vs SL : టీమ్ఇండియాకు భారీ షాక్.. సోనల్ దినూష వీరోచిత పోరాటం.. రెండో టెస్టు మ్యాచ్ డ్రా..

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాల‌ని భావించిన భార‌త్‌కు (IND vs SL) గ‌ట్టి షాక్ త‌గిలింది.

Sonal Dinusha superb innings India vs Srilanka 2nd Test match draw

IND vs SL : రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాల‌ని భావించిన భార‌త్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. శ్రీలంక మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ సోన‌ల్ దినూష (133 నాటౌట్; 264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) వీరోచిత పోరాటంతో కొలంబో వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. తొలి టెస్టు మ్యాచ్‌లో విజ‌యం సాధించిన భార‌త్ సిరీస్‌ను 1-0తో కైవ‌సం చేసుకుంది.

నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు ప‌డ‌గొట్టిన భార‌త బౌల‌ర్లు.. చివ‌రి రోజున మిగిలిన‌ 4 వికెట్లు తీయ‌లేక‌పోయారు. రోజంతా బౌలింగ్ చేసిన మూడు వికెట్లు మాత్ర‌మే సాధించారు. దీంతో ఈజీగా రెండో టెస్టులో విజ‌యం సాధించ‌వ‌చ్చున‌ని భావించిన భార‌త్ డ్రాతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

6 వికెట్ల న‌ష్టానికి 229 ప‌రుగుల‌తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన శ్రీలంక గ‌ట్టిగానే పోరాడింది. ఓవ‌ర్ నైట్ బ్యాట‌ర్లు సోన‌ల్ దినూష, కేశర నువాంత డ్రా ల‌క్ష్యంగానే బ్యాటింగ్ చేశారు. జిడ్డు బ్యాటింగ్‌తో భార‌త బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించారు. చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. 7 ప‌రుగుల‌తో ఐదో రోజు బ్యాటింగ్ కొన‌సాగించిన దినూష సెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్నాడు. మ‌రో వైపు 3 ప‌రుగుల‌తో బ్యాటింగ్ కొన‌సాగించిన నువాంత (46; 150 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీకి నాలుగు ప‌రుగుల దూరంలో ఔట్ అయ్యాడు.

నువాంత‌, దినూష ఏడో వికెట్‌కు 112 ప‌రుగులు జోడించారు. 40 ఓవ‌ర్ల పాటు ఈ జంట బ్యాటింగ్ కొన‌సాగించింది. నువాంత ఔట్ కావ‌డంతో మిగిలిన వికెట్ల‌ను తొంద‌ర‌గా తీసి స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ ఛేదింస్తుంద‌ని అంతా భావించారు. అయితే.. ప్ర‌భాత్ జ‌య‌సూర్య (2; 28 బంతుల్లో), ల‌హిర్ కుమార (12; 90 బంతుల్లో 1 ఫోర్లు)ల‌తో క‌లిసి సోన‌ల్ గొప్ప‌గా పోరాడాడు.

ప్ర‌భాత్ తొంద‌ర‌గానే ఔట్ అయిన‌ప్ప‌టికి కూడా ల‌హిర్‌, సోన‌ల్ జంట ఏకంగా 28 ఓవ‌ర్ల పాటు వికెట్ ఇవ్వ‌కుండా భార‌త్‌ను స‌తాయించింది. లీడ్‌ను 200 దాటించింది. ఆఖ‌రికి ల‌హిర్ ఔట్ అయిన కాసేప‌టికే..  9 వికెట్ల న‌ష్టానికి 429 ప‌రుగుల వ‌ద్ద లంక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అప్ప‌టికే లంక జ‌ట్టు 216 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. మ‌రో 17 ఓవ‌ర్లు మాత్ర‌మే ఉండ‌డంతో ఇరు జ‌ట్ల కెప్టెన్లు డ్రా కు అంగీక‌రించారు.

సంక్షిప్త స్కోర్లు..

భార‌త తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్‌
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్‌
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్‌