Temba Bavuma : రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్.. ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డులు
Temba Bavuma : దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో సెంచరీ చేసి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
- Harish Thanniru
- Published on- October 20, 2026 / 09:48 PM IST
Temba Bavuma
Temba Bavuma : దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అద్భుత సెంచరీతో చెలరేగాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవడమే కాకుండా, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును అధిగమించి అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తన టెస్ట్ కెరీర్లో ఐదో శతకాన్ని నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై బవుమాకు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కావడం విశేషం
Also Read : IND-W vs ZIM-W : హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత్ భారీ స్కోరు
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే తడబడింది. ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత కూడా వికెట్లు పడటంతో దక్షిణాఫ్రికా జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సమయంలో కెప్టెన్ టెంబా బవుమా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్‌ను కాపాడుకుంటూనే పరుగులు సాధిస్తూ జట్టును ఆదుకున్నాడు.
మరోవైపు మార్కో జాన్సెన్ దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 132 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్కో జాన్సెన్ 85 పరుగులు చేసి ఔటయ్యారు. మరో బ్యాటర్ సైమన్ హార్మర్ 82 పరుగులతో రాణించారు. బవుమా 179 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 425 పరుగుల వద్ద 9 వికెట్లకు తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఒపుమా సెంచరీతో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు.
రోహిత్ శర్మ రికార్డు బద్దలు..
టెస్టు కెరీర్లో బావుమాకు ఇది ఐదో సెంచరీ. భారత్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా బావుమా (36 సంవత్సరాల 154 రోజులు) కొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో 2023లో నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఆ సమయంలో రోహిత్ వయసు 35 సంవత్సరాల 285 రోజులుగా ఉంది. తాజాగా అతడి పేరిట ఉన్న రికార్డును బావుమా అధిగమించాడు. అలాగే, ఆస్ట్రేలియాపై టెస్టుల్లో సెంచరీ సాధించిన నాల్గో సౌతాఫ్రికా కెప్టెన్‌గా బావుమా మరో ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఇంతకుముందు గ్రేమ్ స్మిత్, జాక్వెస్ కల్లిస్, ఫాఫ్ డుప్లెసిస్ మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ సరసన బావుమా చేరాడు.
