LPL Rules : బోర్డు తలతిక్క నిర్ణయం.. ఇన్ స్టా ఫాలోయర్స్ లేకపోతే..
LPL Rules : LPL కోసం తీసుకువచ్చిన కొత్త నిబంధన తీవ్ర వివాదాన్ని రాజేసింది.
- Dharani Pilli
- Updated on- May 9, 2026 / 04:30 PM IST
Sri Lanka League new rules say less social media followers in IPL
- LPLలో కొత్త నిబంధన
- సోషల్ మీడియా ఫాలోవర్లను బట్టి ఎంపిక
- తీవ్ర వివాదంగా మారిన నిర్ణయం
LPL Rules : శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్ (LPL) కు సంబంధించి క్రికెట్ అభిమానులు విస్తుపోయే వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ఆ వార్త ఏంటంటే LPL కోసం ఎంపిక చేసే ఆటగాళ్ల ప్రక్రియలో వారి సోషల్ మీడియా మరీ ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ప్రముఖ పాత్ర పోషించబోతుంది. సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే.. ఆ ఆటగాడికి అంత ప్రయోజనం కల్పించనున్నారనే వార్త క్రీడా అభిమానులనే కాక సామాన్యులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. శ్రీలంకకు చెందిన ‘న్యూస్ వైర్’ నివేదిక ప్రకారం.. జూలై 10 నుండి ఆగస్టు 5, 2026 వరకు జరగనున్న LPL ఆరో సీజన్ కోసం ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో వారి సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను ఒక ప్రామాణికంగా చేర్చనున్నారని ప్రచురించింది.
*అక్కడే మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం.. వారివల్లనే ఈ ఓటమి.. కెప్టెన్ అక్షర్ పటేల్ సంచలన కామెంట్స్
మ్యాచ్ అనుభవంతో పాటు ఆటగాడి మార్కెట్ విలువను అధికారికంగా లెక్కించాలంటూ లీగ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. అంతేకాక అసలు ఈ నిబంధనలు నిజమేనా లేక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి అభిమానుల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న డ్రామానా అంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం ఆటగాళ్లను 5 కేటగిరీలుగా విభజించారు. అందుకు తగ్గట్టుగా మ్యాచ్ లు, అనుభవం, సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను నిర్ణయించారు. ఆ వివరాలు..
ఐకాన్ (Icon) కేటగిరీ
ఇది అత్యున్నత కేటగిరీ. ఇందులో చోటు దక్కించుకోవాలంటే.. సదరు ఆటగాడు కనీసం 75 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, ప్రపంచవ్యాప్తంగా 100 ఫ్రాంచైజీ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అలానే గడిచిన ఏడాదిన్నరలో అంటే 18 నెలల్లో 30 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి.
ముఖ్య నిబంధన: సదరు ఆటగాడు ఈ కేటగిరీకి ఎంపిక కావాలంటే.. సోషల్ మీడియాలో కనీసం 2,50,000 మంది ఫాలోవర్లు ఉండాలి.
స్టార్ (Star) కేటగిరీ
ఇది రెండవ అత్యుత్తమ కేటగిరీ. దీనికి ఎంపిక కావాలంటే.. సదరు ఆటగాడు కనీసం 50 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 100 ఫ్రాంచైజీ మ్యాచ్‌లు ఆడి ఉంటే సరిపోతుంది. ఇక సోషల్ మీడియా ఫాలోవర్ల విషయానికి వస్తే.. ఈ కేటగిరీకి సెలక్ట్ కావాలంటే సదరు ఆటగాడికి కూడా సోషల్ మీడియాలో కనీసం 2,50,000 మంది ఫాలోవర్లు ఉండాలి.
గోల్డ్ (Gold) కేటగిరీ
ఈ కేటగిరీ కిందకు వచ్చే ఆటగాళ్లు 30 టీ20లు, 75కి పైగా ఫ్రాంచైజీ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
ముఖ్య నిబంధన: ఈ ఆటగాళ్లకు సోషల్ మీడియాలో కనీసం 1,50,000 మంది ఫాలోవర్లు ఉండాలి.
క్లాసిక్ (Classic) కేటగిరీ
ఈ కేటగిరీకి ఎంపిక చేసే ఆటగాళ్లు 20 టీ20లు, 50 కంటే ఎక్కువ ఫ్రాంచైజీ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అయితే ఈ కేటగిరీకి సంబంధించి ఒక విచిత్రమైన నిబంధన ఉంది. ఇంగ్లీష్ వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. ఈ కేటగిరీ ఆటగాళ్లకు “సముచితమైన అభిమానుల బేస్, వాణిజ్యపరమైన ఆకర్షణ” ఉండాలి అనే నిబంధన పెట్టారు.
అయితే ఇక్కడ అత్యంత విషాదకర, ఆశ్చర్యకర అంశం ఏంటంటే.. LPL కి సెలక్ట్ అయ్యే ఆటగాళ్లకు లక్షల్లో ఫాలోవర్లు ఉండాలని నిబంధనలు పెడుతున్న లంక ప్రీమియర్ లీగ్ (LPL) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీకే 1,00,000 కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే, లీగ్ తన సొంత ఫాలోవర్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఆటగాళ్ల కోసం డిమాండ్ చేస్తోందన్నమాట. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముందు నీ ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలో ఆలోచించుకో.. ముందు నువ్వు 2.50 లక్షల ఫాలోవర్లను సంపాదించుకుని ఆ తర్వాత రూల్స్ పెడితే చూడ్డానికి, వినడానికి బాగుంటుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
