×
Ad

T20 World Cup : మేం చేసిన పెద్ద త‌ప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ హాట్ కామెంట్స్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓడిపోయింది.

T20 World Cup 2026 Aiden Markram Comments after South Africa lost semis match to New Zealand

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ద‌క్షిణాఫ్రికా ఔట్‌
  • సెమీస్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్‌
  • ఓట‌మిపై స్పందించిన మార్‌క్ర‌మ్‌

T20 World Cup : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 నుంచి ద‌క్షిణాఫ్రికా నిష్ర్క‌మించింది. ఓట‌మే ఎర‌గ‌కుండా సెమీస్‌కు చేరుకున్న సౌతాఫ్రికా జ‌ట్టు బుధ‌వారం కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. బ్యాట‌ర్ల వైఫ‌ల్య‌మే త‌మ కొంప‌ముంచింద‌ని ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో మార్కో జాన్సెన్ (55 నాటౌట్; 30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ (34; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)లు రాణించారు. కివీస్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ, కోల్ మెక్‌కాంచీ, రచిన్ రవీంద్రలు త‌లా రెండు వికెట్లు తీశారు. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్‌.. బుమ్రా ఒక్క వికెట్ తీస్తే చాలు..

అనంత‌రం ఫిన్ అలెన్ (100 నాటౌట్; 33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ జ‌ట్టు 12.5 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోయి అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (58; 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాప్ సెంచ‌రీ చేశాడు. కివీస్ కోల్పోయిన ఒక్క వికెట్‌ను కగిసో ర‌బాడ ప‌డ‌గొట్టాడు.

ఆరంభంలో బంతి బ్యాట్‌పైకి రాలేదు..

మ్యాచ్ అనంత‌రం ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ ఓట‌మిపై స్పందించాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు ప్ర‌తికూలంగా ఉంద‌న్నాడు. బంతి బ్యాట్ పైకి రాలేద‌న్నాడు. కొన్ని బంతులు ఆగుతూ రాగా.. మ‌రికొన్ని త‌క్కువ ఎత్తులో వచ్చాయ‌న్నాడు. ప‌రుగులు చేయాల‌నే ఒత్తిడిలో తాము వికెట్లు కోల్పోయామ‌ని చెప్పాడు. ఇక ప‌రిస్థితుల‌ను స‌ద్వినియోగం చేసుకుని కివీస్ బౌల‌ర్లు అద్భుతంగా బంతులు వేశార‌ని చెప్పుకొచ్చాడు. కివీస్ బౌల‌ర్ల‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేన‌ని అన్నాడు.

ఫిన్ అలెన్ ఆ త‌ర‌హా ఇన్నింగ్స్ ఆడిన‌ప్పుడు ఫీల్డింగ్ టీమ్ గెలిచే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌న్నాడు. వాస్త‌వం చెప్పాలంటే.. తాము 170 ప‌రుగులు చేయ‌డ‌ము కూడా గొప్ప ప్ర‌య‌త్న‌మే అని అన్నాడు. ఇక కివీస్ ఓపెన‌ర్లు ప‌వ‌ర్ ప్లేలో దూకుడుగా ఆడి మ్యాచ్‌ను త‌మ నుంచి లాగేసుకున్నార‌న్నాడు. అయితే.. తాము 190 ప‌రుగులు చేసి ఉంటే మ్యాచ్‌లో నిలిచి ఉండేవాళ్ల‌మ‌ని అన్నాడు.

IND vs ENG : సెమీస్ మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ వార్నింగ్‌.. కాస్కోండి.. గురువారం వాంఖ‌డేలో మొత్తం నిశ్శ‌బ్ద‌మే

ఇక ఈ టోర్నీలో త‌మ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల మార్‌క్ర‌మ్ సంతృప్తి వ్య‌క్తం చేశాడు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడార‌ని మెచ్చుకున్నాడు. దుర‌దృష్టం ఏంటి అంటే ఈ ఒక్క రాత్రి త‌మ‌కు క‌లిసిరాలేద‌న్నాడు. ఈ ఓట‌మి బాధ‌క‌లిగించింద‌న్నాడు. ఈ బాధ నుంచి బ‌య‌ట ప‌డిన త‌రువాత జ‌ట్టుగా దీని గురించి చ‌ర్చిస్తామ‌ని చెప్పాడు. తాము చేసిన త‌ప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని బ‌లంగా తిరిగి వ‌స్తామ‌ని మార్‌క్ర‌మ్ అన్నాడు.