T20 World Cup 2026 IND vs PAK Mike Hesson Reveals What Happened In Dressing Room After Crushing Defeat To India
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 61 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ప్లేయర్లు పూర్తిగా నిరాశ చెందారని, డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో బాధపడుతున్నారని పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ తెలిపాడు.
ఇషాన్ కిషన్ (77; 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ సాధించారు.
T20 World Cup 2026 : భారత్ చేతిలో ఘోర ఓటమి.. ఇలా జరిగితే టీ20 ప్రపంచకప్ నుంచి కూడా పాక్ ఔట్..
మ్యాచ్ అనంతరం పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. డ్రెస్సింగ్ రూమ్ మొత్తం నిరాశలో కూరుకుపోయింది. భారత్‌తో మ్యాచ్ ఎంత ముఖ్యమో వారికి తెలుసు. అని అన్నాడు.
కాగా.. ప్రేమదాస స్టేడియంలో గత మూడు మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఈ నేపథ్యంలో తాము బౌలింగ్ ఎంచుకోవాలనే నిర్ణయాన్ని అతడు సమర్థించుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలో బంతి బాగా తిరుగుతుందని తాము భావించామని చెప్పుకొచ్చాడు. ఇక ఇన్నింగ్స్‌ను తాము బాగా ప్రారంభించామని, అయితే.. ఇషాన్ కిషన్ మ్యాచ్‌ను తమ నుంచి దూరం చేశాడని తెలిపాడు.
పాక్ పై విజయం సాధించడంతో సూపర్-8కి భారత్ అర్హత సాధించింది. పాక్ జట్టు సూపర్ 8కి అర్హత సాధించాలంటే బుధవారం నమీబియాపై గెలవాల్సి ఉంటుంది. దీనిపై హెస్సన్ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్ ముందు నుంచి తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని, అదే ఈ టోర్నమెంట్‌లోనూ కంటిన్యూ చేస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో గెలుపొంది సూపర్-8 కి అర్హత సాధిస్తామని తెలిపాడు.
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ హెడ్ కోచ్ గా మైక్ హెస్సన్ బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి ఇప్పటి వరకు భారత జట్టుతో పాక్ నాలుగు సార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడిపోవడం గమనార్హం.