T20 World Cup 2026 IND vs SA Aiden Markram comments after South Africa beat India
IND vs SA : టీ20 ప్రపంచప్ 2026లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. వరుస విజయాలతో సూపర్-8లో అడుగుపెట్టింది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో భారత్‌ను చిత్తు చేసింది. ఏకంగా 76 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ పై విజయం సాధించడం పట్ల సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత భాగస్వామ్యం కారణంగానే తాము ఈ మ్యాచ్‌లో విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. ఇరు జట్లలో ఉన్న వ్యత్యాసం ఇదేనని అన్నాడు.
డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63 పరుగులు), డేవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45 పరుగులు), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44నాటౌట్) లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, శివమ్‌దూబె లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత 188 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో శివమ్ దూబె (42; 37 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు తీయగా.. కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కార్బిన్ బాష్ రెండు, ఐడెన్ మార్‌క్రమ్ ఓ వికెట్ సాధించాడు.
మ్యాచ్ అనంతరం సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మాట్లాడుతూ.. ఇదొ గొప్ప విజయం అని చెప్పుకొచ్చాడు. గతంలో ఈ మైదానంలో తాము ఆడిన వికెట్‌తో పోలిస్తే పిచ్ చాలా భిన్నంగా ఉందన్నాడు. అయితే.. తమ బౌలర్లు వికెట్‌ను ముందుగానే అంచనా వేశారని, అందుకు తగ్గట్టుగా బౌలింగ్ చేసి ఫలితం రాబట్టారని మెచ్చుకున్నాడు. ఈ టోర్నీ ఆరంభంలో కొంచెం కష్టంగా అనిపించినప్పటికి భారత్‌తో మ్యాచ్‌లో బౌలర్లు చాలా గొప్పగా బౌలింగ్ చేశారని అన్నాడు.
బ్యాటింగ్‌లో డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ చాలా అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. వారిద్దరి భాగస్వామ్యమే తమని నిలబెట్టిందన్నాడు. పిచ్ పై బంతి ఆగుతూ వచ్చింది. అందుకనే భారీ షాట్లకు బదులుగా ఖాళీల్లోకి బంతిని నెట్టి సాధ్యమైనన్ని పరుగులు తీశామన్నాడు. ఇక భారత బౌలర్లు ఇన్నింగ్స్ ఆరంభంలో, ఆఖరిలో గొప్పగా బౌలింగ్ చేశారన్నాడు. అయితే మిడిల్ ఓవర్లలో తమ బ్యాటింగే ఇరు జట్లలో ఏకైక తేడా అని చెప్పుకొచ్చాడు.
యూఏఈతో మ్యాచ్‌లో మేం అంతగా సమిష్టిగా ఆడలేకపోయాము. అయితే.. ఈ మ్యాచ్‌లో మాత్రం గొప్పగా ఆడామన్నాడు. అయితే.. ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లను జారవిడడం బాగాలేదన్నడు. ఇక తరువాత వెస్టిండీస్‌తో ఆడడం గురించి మాట్లాడుతూ.. ఈ టోర్నీ కన్నా ముందే తాము వెస్టిండీస్‌తో ఆడామన్నాడు. సోమవారం ఉదయం నుంచి ఆ మ్యాచ్‌పై ఫోకస్ పెడతామన్నాడు. అది చాలా పెద్ద మ్యాచ్ అని, ఆ మ్యాచ్‌లో గెలిచేందుకు తాము శాయశక్తుల ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు మార్‌క్రమ్.