T20 World Cup : ఇవేం పనులురా అయ్యా.. హోటల్ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన పాక్ క్రికెటర్.. టీ20 ప్రపంచకప్‌లో ఆడుతూనే..!
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సమయంలో ఓ మహిళతో పాక్ క్రికెటర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : March 5, 2026 / 12:47 PM IST
T20 World Cup 2026 Pakistan Player Misbehaves With Female Hotel Staff report
- హోటల్ మహిళా సిబ్బందితో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన
- పొట్టిప్రపంచకప్‌లో శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు
- ఆలస్యంగా వెలుగులోకి
T20 World Cup : పేలవ ప్రదర్శనతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్ర్కమించింది. ప్రస్తుతం ఆ జట్టు పై స్వదేశంలో విమర్శల జడివాన కురుస్తోంది. ఓ వైపు విమర్శల వర్షం కురుస్తుండగానే ఓ పాక్ ఆటగాడు వివాదంలో చిక్కుకున్నాడు. ప్రపంచకప్ సమయంలో ఓ మహిళతో పాక్ క్రికెటర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఆఖరి మ్యాచ్‌కు ముందు ఓ పాక్ క్రికెటర్ తాము బస చేస్తున్న హోటల్‌లోని హౌస్ కీపింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో సదరు మహిళ సాయం కోసం గట్టిగా అరవగా.. మిగతా హోటల్ సిబ్బంది వచ్చి ఆమెను రక్షించారు.
ఈ విషయం పై సదరు హోటల్ మేనేజ్‌మెంట్ సీరియస్ అయింది. సదరు ఆటగాడిపై పాకిస్థాన్ టీమ్ మేనేజర్ నవైద్ చీమాకు ఫిర్యాదు చేసింది. సదరు ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే.. నవైద్ చీమా ఆటగాళ్ల తరుపున సదరు హోటల్ సిబ్బందికి క్షమాపణలు తెలియజేసినట్లు ఆసియా స్పోర్ట్స్ ఓ కథనంలో తెలిపింది. సదరు క్రికెటర్‌కు భారీ జరిమానా విధించినట్లు పేర్కొంది.
కాగా.. సదరు ఆటగాడు ఎవరు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే.. అతడు త్వరలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రమ శిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉందని సమాచారం. అప్పుడు బోర్డు అతడిపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే.. శ్రీలంక పై భారీ విజయం సాధించి ఉంటే పాక్ సెమీస్ చేరుకుని ఉండేది. కానీ కేవలం 5 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. దీంతో మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగిన కివీస్ సెమీస్ చేరుకుంది.
కాగా.. పాక్ ఆటగాళ్లు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. గతంలో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఓ యువతిపై పాక్ ఆటగాడు హైదర్ అలీ అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. మాంచెస్టర్ పోలీసులు అతడిని అరెస్టు కూడా చేశారు. అయితే.. ఆరోపణలపై సరైన ఆధారాలు లేకపోవడంతో అతడు విడుదల అయ్యాడు. అంతకముందు కొన్నేళ్ల క్రితం మలేషియా పర్యటనలో పాక్ టీమ్ మసాజ్ నిపుణుడు మలాంగ్ అలీ ఓ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి.
