Pakistan Cricket Board Representative Image (Image Credit To Original Source)
T20 World Cup 2026: పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ను బాయ్ కాట్ చేసింది. అయితే ఈ టోర్నీలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని పాక్ తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. మార్చి 8 వరకు టోర్నీ సాగనుంది. శ్రీలంక, భారత్ ఆతిథ్యం ఇస్తున్నాయి. టోర్నీలో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కు అనుమతి మంజూరు చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్స్ లో ప్రకటించింది.
“ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఫిబ్రవరి 15న ఇండియాతో జరగనున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మైదానంలోకి దిగదు” అని పాక్ ప్రభుత్వం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రాసింది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న కారణంగా టోర్నమెంట్‌ను పాకిస్తాన్ బహిష్కరించే అంశంపై చర్చిస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆ దేశ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్న తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఈ విషయంపై నఖ్వీ ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిశారు.
తన మ్యాచ్‌లను భారత్ లో కాకుండా శ్రీలంకలో ఆడేందుకు అనుమతించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ అంగీకరించకపోవడంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ పోటీ నుంచి తప్పుకోవడంతో దాని స్థానాన్ని స్కాట్లాండ్ జట్టు భర్తీ చేసింది.
గత సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు PCB, ICC, BCCI మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని జట్టు తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. భారత్ కి వెళ్లదు. ఇక భారత్ పాకిస్తాన్ ఏ ICC టోర్నమెంట్ కోసం ఒకరి దేశానికి మరొకరు వెళ్లవు.
బులవాయోలో ICC U19 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్న సమయంలో ఈ ప్రకటన రావడం విశేషం. గతంలో ICC టోర్నమెంట్‌లో జట్లు ఒకే ఒక మ్యాచ్‌ను బహిష్కరించిన సందర్భం ఉంది. 1996 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ శ్రీలంకతో ఆడలేదు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సైతం 2003లో జింబాబ్వే, కెన్యాతో అలానే చేశాయి.
Also Read: వాటి గురించి ఆలోచనలేదు.. మా లక్ష్యం ఆ ఒక్కటే.. టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్ ..