pcb has put forward three major demands to icc
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని తమ జట్టును పాక్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రపంచంలో ఎంతో క్రేజ్ ఉన్న భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ జరగకపోతే.. ఎంతో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఐసీసీ తో పాటు సభ్య దేశాలు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతాయి. ఈ క్రమంలో మ్యాచ్‌ను ఎలాగైనా నిర్వహించాలని ఐసీసీ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతోంది.
ఆదివారం ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ అమీనుల్ ఇస్లాంల మధ్య సమావేశం జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సానుకూలంగా స్పందించిందని.. కానీ ఐసీసీ ముందు ప్రధానంగా మూడు డిమాండ్లను ముందు ఉంచినట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లకు ఓకే చెబితే భారత్‌తో మ్యాచ్ ఆడతామని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఐసీసీ నుంచి ప్రతి ఏటా వాటాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వస్తున్న నిధుల కోటాను పెంచాలని కోరింది. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఆటగాళ్ల అన్వేషణ, జాతీయ జట్టు పోటీ ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు నిధుల పెంపు తప్పని సరి అని తెలిపింది.
టీ20 ప్రపంచకప్‌లో ఆడకపోయినా బంగ్లాదేశ్‌కు పార్టిసిపేషన్ ఫీజు..
భద్రతా కారణాలతో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. అయితే.. ఇందుకు ఐసీసీ అంగీకరించలేదు. ఎంత చెప్పినప్పటికి కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వినకపోవడంతో.. మెగాటోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది ఐసీసీ.
కాగా.. టీ20 ప్రపంచకప్‌లో ఆడకపోయినప్పటికి కూడా బంగ్లాదేశ్‌కు పార్టిసిపేషన్ ఫీజును చెల్లించాలని సమావేశంలో పాక్ డిమాండ్ చేసింది.
ఐసీసీ ఈవెంట్‌లకు ఆతిథ్య హక్కులు
భవిష్యత్‌లో బంగ్లాదేశ్‌లో ఐసీసీ ఈవెంట్‌లను నిర్వహించే విధంగా ఆతిథ్య హక్కులను ఇవ్వడం.. వంటి డిమాండ్లను ఐసీసీ ముందు పాక్ ఉంచినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో భారత్‌తో మ్యాచ్ ఆడే విషయమై స్పష్టమైన వైఖరి చెప్పాలని పాక్‌కు ఐసీసీ 24 గంటల డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.
కాగా.. తమ నిర్ణయాన్ని ప్రకటించే ముందు సోమవారం ప్రభుత్వంతో పాక్ క్రికెట్ బోర్డు సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది.