ఇక ఇండియా అస్సామేనా.. వరల్డ్ కప్ నుంచి వెళ్లిపోవాల్సిందేనా?.. ఈ అద్భుతం జరిగితే ఇంకా చాన్స్ ఉంది..
దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో భారత (Team India) జట్టు సెమీస్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.
- Thota Vamshi Kumar
- Published On : February 23, 2026 / 08:46 AM IST
T20 World Cup 2026 Semifinal Scenario What team india chances after lost match to South Africa
Team India : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో భారత జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్‌రన్‌రేటు ఘోరంగా దెబ్బతింది. ఇక టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంది.
భారతదేశం సెమీస్‌కు ఎలా అర్హత సాధించగలదు?
76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో భారత జట్టు నెట్ రన్‌రేటు తీవ్రంగా దెబ్బతింది. టీమ్ఇండియా ప్రస్తుత రన్‌రేటు -3.800గా ఉంది. దీంతో భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా కూడా సెమీస్‌కు అర్హత సాధించడం కష్టమే. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధాపడాల్సి ఉంటుంది.
* మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్.. వెస్టిండీస్, జింబాబ్వేలను ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు వచ్చి చేరతాయి. అదే సమయంలో మరో రెండు జట్లు నాలుగు పాయింట్లు సాధించనట్లయితే భారత్ సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ మరో రెండు జట్లు 4 పాయింట్లతో ఉంటే మాత్రం టీమ్ఇండియాకు కష్టమే. అప్పుడు మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. కాబట్టి టీమ్ఇండియా తన నెట్‌రన్‌రేటును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.
* మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటే మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. అప్పుడు దక్షిణాఫ్రికా తమ మిగిలిన మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ విజేతను టీమ్ఇండియా ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తలా రెండు పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్‌రన్‌రేటు కీలక పాత్ర పోషించనుంది.
సూపర్-8లో భారత్ ఆడనున్న మ్యాచ్‌లు ఇవే..
* ఫిబ్రవరి 26న – జింబాబ్వేతో చెన్నై వేదికగా
* మార్చి 1న – వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా
