×
Ad

T20 World Cup 2026 : ఏంది సామీ నువ్వు చెప్పేది.. ఇలా జ‌రిగితే నెట్‌ర‌న్‌రేటుతో భార‌త్‌కు సంబంధం లేదా? టీమ్ఇండియా పంట పండిన‌ట్లే!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) వెస్టిండీస్ పై ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు గెల‌వాల‌ని భార‌త జ‌ట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

T20 world cup 2026 Team india semifinal hopes depend on SA vs WI match result

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో నేడు రెండు కీల‌క మ్యాచ్‌లు
  • జింబాబ్వేతో భార‌త్‌, వెస్టిండీస్‌తో ద‌క్షిణాఫ్రికా ఢీ
  • వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా గెలిస్తే నెట్‌ర‌న్‌రేటుతో భార‌త్‌కు సంబంధం లేదు..

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా గురువారం భార‌త జ‌ట్టు జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. అయితే.. ఈమ్యాచ్ క‌న్నా ముందు ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య అహ్మ‌దాబాద్ వేదిక‌గా మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ ఫ‌లితం భార‌త జ‌ట్టు సెమీస్ అవ‌కాశాల‌ను చాలా గట్టిగానే ప్ర‌భావం చేయ‌నుంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు టీమ్ఇండియా ఫ్యాన్స్‌తో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్ సేన ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నారు.

సూప‌ర్‌-8 తొలి మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా చేతిలో ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు నెట్‌ర‌న్‌రేటు (-3.800)దారుణంగా ప‌డిపోయింది. ఇంకోవైపు వెస్టిండీస్ జ‌ట్టు జింబాబ్వేను భారీ తేడాతో ఓడించడంతో భారీ నెట్‌ర‌న్‌రేటును (+5.350) సొంతం చేసుకుంది. ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్ పాయింట్లు స‌మంగా ఉన్న మెరుగైన నెట్‌ర‌న్‌రేటు క‌లిగిన వెస్టిండీస్ ప్ర‌స్తుతం గ్రూప్‌-1లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

IND vs ZIM : భార‌త్ వ‌ర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు ఉందా?

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించాల‌ని భార‌త జ‌ట్టు కోరుకుంటోంది. ఎందుకంటే స‌ఫారీ జ‌ట్టు విజ‌యం సాధిస్తే అప్పుడు భార‌త్ సెమీస్‌కు వెళ్లేందుకు మార్గం ఈజీ అవుతుంది. అదే వెస్టిండీస్ విజ‌యం సాధిస్తే మాత్రం భార‌త్.. జింబాబ్వే మ్యాచ్‌తో పాటు త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లోనూ అత్యంత భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది.

వెస్టిండీస్ ఓడిపోతే ఏం జ‌రుగుతుంది?

ద‌క్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోతే భార‌త్ పంట పండిన‌ట్లే. ఎందుకంటే అప్పుడు నెట్‌ర‌న్‌రేటుతో ప‌ని ఉండ‌దు. విండీస్ పై గెలిస్తే ద‌క్షిణాఫ్రికా ఖాతాలో 4 పాయింట్లు చేరడంతో గ్రూప్‌-1లో అగ్ర‌స్థానానికి చేరుకుంటుంది. భార‌త జ‌ట్టు జింబాబ్వే పై విజ‌యం సాధిస్తే రెండు పాయింట్లు వ‌చ్చి చేర‌తాయి. అప్పుడు భార‌త్, వెస్టిండీస్ జ‌ట్లు చెరో రెండు పాయింట్ల‌తో స‌మంగా ఉంటాయి. అదే జ‌రిగితే.. మార్చిన 1న భార‌త్, వెస్టిండీస్ మ్యాచ్ కీల‌క మ్యాచ్ గా మారుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా సెమీస్‌లో అడుగుపెట్ట‌నుంది. ఇక ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు త‌మ చివ‌రి మ్యాచ్‌లో జింబాబ్వేతో ఆడ‌నుంది. ఈ మ్యాచ్ ఫ‌లితంతో ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఈ మ్యాచ్‌లో స‌పారీలు ఓడిపోయిన‌ప్ప‌టికి 4 పాయింట్ల‌తో సెమీస్ చేరుకుంటారు.