T20 World Cup 2026 Zimbabwe IN Super hot form threat to Team India
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో పసికూనగా అడుగుపెట్టింది జింబాబ్వే. శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లున్న గ్రూపు-బిలో ఉండడంతో ఆ జట్టుకు కష్టమే అని అంతా భావించారు. కొంచెం కష్టపడితే ఐర్లాండ్, ఒమన్ లపై విజయం సాధించి గ్రూప్ దశ నుంచే నిష్ర్కమిస్తుందని క్రికెట్ పండితులు జోస్యం చెప్పారు. అసలు ఆస్ట్రేలియా పై విజయం సాధిస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. కట్ చేస్తే అంతా అంచనాలకు మించి రాణించింది జింబాబ్వే.
ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్‌లో ఒమన్ పై విజయం సాధించిన జింబాబ్వే ఆ తరువాత పెను సంచలనం సృష్టించింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఇక ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కాగా.. ఆస్ట్రేలియా పై విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ తాజాగా శ్రీలంక పై గెలుపొందింది. సికిందర్ రజా నాయకత్వంలోని జింబాబ్వే ఏకంగా గ్రూప్-బిలో అగ్రస్థానంతో సూపర్-8లో అడుగుపెట్టింది.
సూపర్-8లో గ్రూప్-1లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో కలిసి జింబాబ్వే ఉంది. సూపర్-8లో జింబాబ్వే తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 23న (సోమవారం) వెస్టిండీస్‌తో ఆడనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 26న భారత్‌తో తలపడనుంది. మార్చి1 న సౌతాఫ్రికాను ఢీ కొట్టనుంది.
తక్కువగా అంచనా వేస్తే..
ఈ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో జింబాబ్వే చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మరువాని జట్టుకు అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నారు. వీరిద్దరు మంచి పామ్‌లో ఉండడం ఆ జట్టుకు పెద్ద బలం. ఇక బ్రియాన్ బెన్నెట్ అయితే ఈ మెగాటోర్నీలో ఒక్కసారి కూడా ఔట్ కాలేదు.
T20 World Cup 2026 : జింబాబ్వే చేతిలో ఓటమిపై స్పందించిన శ్రీలంక కెప్టెన్.. నిజం చెప్పాలంటే
మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ సికిందర్ రజా అదరగొడుతున్నాడు. సందర్భాన్ని బట్టి అవసరం అయితే హిట్టింగ్ లేదంటే సింగిల్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక బౌలింగ్‌లో బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్ లతో పాటు కెప్టెన్ సికిందర్ రజా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
గ్రూప్ దశలో అదరగొట్టిన జింబాబ్వే జట్టు సూపర్-8లో ఎలా రాణిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు.