T20 World Cup
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీ-2026లో భాగంగా గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో భారత జట్టును అధిగమించి పాకిస్థాన్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటి వరకు ఒక మ్యాచ్ ఆడింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో 32 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడింది. తొలి మ్యాచ్ నెదర్లాండ్స్ పై ఆడిన పాకిస్థాన్ జట్టు.. అతికష్టం మీద విజయం సాధించింది. అయితే, మంగళవారం యూఎస్ఏ జట్టుపై జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ అలవోకగా విజయం సాధించింది. దీంతో గ్రూప్- ఏ విభాగం నుంచి పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. మరోవైపు.. టీమిండియా ఇప్పటి వరకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. ఈనెల 12న (గురువారం) నమీబియాతో టోర్నీలో రెండో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే పాకిస్థాన్ కంటే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడగా.. రెండింటిలోనూ విజయం సాధించి నాలుగు పాయింట్లు సాధించింది. భారత్ జట్టు ఇప్పటి వరకు ఒక మ్యాచ్ ఆడి విజయం సాధించింది. దీంతో రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థాయిలో నిలిచింది. నెదర్లాండ్స్ జట్టు రెండు మ్యాచ్ లు ఆడగా.. ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. దీంతో రెండు పాయింట్లతో మూడో స్థాంలో ఉంది. నమీబియా ఒక మ్యాచ్ లో ఆడి ఓటమి పాలవ్వగా.. అమెరికా రెండు మ్యాచ్ లు ఆడి.. రెండింటిలోనూ ఓడిపోయింది. దీంతో ఆ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు.. భారత్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో ఆడే విషయంపై తొలుత తీసుకున్న నిర్ణయం నుంచి పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా అసలు టీ20 ప్రపంచకప్ లోనే ఆడనని పాకిస్థాన్ మొదట పేర్కొంది.. ఆ తరువాత టోర్నీలో ఆడతాం కానీ, ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆడమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన భారత్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆడతామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.