IND vs ENG : ఐదో టీ20 మ్యాచ్‌లోనూ ఓడిన భారత్.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. వాళ్లవల్లే ఓడిపోయాం..

IND vs ENG : ఐదో టీ20 మ్యాచ్ లోనూ ఓడిపోయిన తరువాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

Team India Captain shreyas iyer Makes Key comments after IND vs ENG 5th T20 Match

  • ఐదో టీ20లోనూ భారత్‌‌పై ఇంగ్లాండ్‌ విజయం
  • 56 పరుగుల తేడాతో గెలుపు
  • 4-0తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్
  • ఇండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్

IND vs ENG : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ జట్టు ఓడిపోయింది. దీంతో ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా విజయం సాధించకపోవటంతో ఇంగ్లాండ్ చేతిలో 0-4తో సిరీస్ కోల్పోయింది. శనివారం జరిగిన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది.

Also Read : IND vs ENG : బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్.. టీ20 చరిత్రలో కొత్త రికార్డు..

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ (45 బంతుల్లో 95 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 103 బంతుల్లోనే 233 పరుగులు జోడించడం విశేషం. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా జట్టు విజయం లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్‌ కిషన్‌ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవటంతో టీమిండియా ఒక్క మ్యాచ్ గెలవకుండానే సిరీస్ ను కోల్పోయింది.

ఐదో టీ20 మ్యాచ్ లోనూ ఓడిపోయిన తరువాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో పరిస్థితులు మారుతూ వచ్చాయని, అయితే చివరి మ్యాచ్‌లోని పిచ్ మాత్రం తాము ఆడిన వాటిలో అత్యుత్తమమని చెప్పారు. అందుకే బ్యాటింగ్ విధానాన్ని కూడా మార్చాల్సి వచ్చిందని తెలిపారు. ప్రొఫెషనల్ జట్టుగా ప్రతి పరిస్థితికి వేగంగా అనుగుణంగా మారడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఫీల్డింగ్ విషయంలో భారత జట్టు కీలక తప్పిదాలు చేసిందని అయ్యర్ అంగీకరించారు. ముఖ్యంగా వదిలేసిన రెండు క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాయని చెప్పారు. ఆ అవకాశాలను వినియోగించుకుని ఉంటే ప్రత్యర్థి జట్టును 220 నుంచి 225 పరుగుల మధ్యే నిలువరించే అవకాశం ఉండేదని, అప్పుడు లక్ష్యాన్ని ఛేదించడం మరింత సులభమయ్యేదని అభిప్రాయపడ్డారు.

బ్యాటింగ్ గురించి మాట్లాడిన ఆయన, పవర్‌ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడమే జట్టును తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. భాగస్వామ్యాలు నిర్మించాల్సిన సమయంలో వేగంగా పరుగులు చేయాలనే ప్రయత్నం చేయడం తప్పిదమైందని అంగీకరించారు. ఇలాంటి పిచ్‌లపై ముందుగా పరిస్థితులను అర్థం చేసుకుని, సరైన బౌలర్లను లక్ష్యంగా చేసుకుని ఆడాల్సి ఉంటుందని చెప్పారు. ఆ విషయంలో మేము విఫలమయ్యామని అన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లు తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారని శ్రేయస్ ప్రశంసించారు. వారికి స్వదేశంలో ఆడిన అనుభవం ఎక్కువగా ఉండటం కూడా కలిసొచ్చిందన్నారు. మ్యాచ్‌లో జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ మధ్య నెలకొన్న కీలక భాగస్వామ్యాన్ని కూడా అయ్యర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగా, బ్రూక్ వచ్చాక మ్యాచ్ రూపే పూర్తిగా మారిపోయిందన్నారు. ఆ భాగస్వామ్యమే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసిందని చెప్పారు. చివరగా, ఈ సిరీస్‌లో ఎదురైన అనుభవాలు భవిష్యత్ విదేశీ పర్యటనల్లో తప్పకుండా ఉపయోగపడతాయని, ఈ పాఠాలతో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని శ్రేయస్ అయ్యర్ విశ్వాసం వ్యక్తం చేశారు.